గ్యాంగ్ రేప్ జరిగిందంటూ పోలీసులను పరుగులు పెట్టించిన యువతి.. సీసీటీవీల్లో నిజం

Nagapur Crime News.తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగానే..

By M.S.R  Published on  14 Dec 2021 8:43 AM GMT
గ్యాంగ్ రేప్ జరిగిందంటూ పోలీసులను పరుగులు పెట్టించిన యువతి.. సీసీటీవీల్లో నిజం

తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగానే.. పోలీసు అధికారులంతా హై అలర్ట్ అయ్యారు. ఉన్నపళంగా టీమ్ లను ఏర్పాటు చేశారు. ఏకంగా 1000 మంది పోలీసులు నిందితులను పట్టుకోడానికి రంగంలో దిగారు. తీరా చూస్తే అదంతా ప్రియుడిని పెళ్లి చేసుకోడానికి యువతి ఆడిన నాటకమని తేలింది. నాగ్‌పూర్‌లోని చిఖాలీ ప్రాంతానికి సమీపంలోని ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని మహిళ తన పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. ఉదయం మ్యూజిక్ క్లాస్ కు హాజరయ్యేందుకు వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు తెల్లటి రంగు వ్యాన్‌లో వచ్చి దారి అడిగారని ఆమె తెలిపింది. ఆ వ్యక్తులు ఆమెను బలవంతంగా వ్యాన్‌లోకి లాగి ముఖానికి ఓ గుడ్డను చుట్టేశారని పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత వారు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో పోలీసులు నగరంలోని సీసీటీవీలు, వ్యాన్‌ల ఫుటేజీలను తనిఖీ చేసేందుకు, మహిళ స్నేహితులను ప్రశ్నించేందుకు 1,000 మందికి పైగా పోలీసులతో కూడిన 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆమెను వైద్య పరీక్షల కోసం మేయో ఆసుపత్రికి పంపినట్లు అధికారి తెలిపారు. ఆరు గంటలకు పైగా తీవ్ర ప్రయత్నాలు చేసి, 50 మందిని విచారించిన తర్వాత, మహిళ సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ కట్టుకథను రూపొందించినట్లు పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. పోలీసులు ఆ మహిళను మరోసారి ప్రశ్నించగా.. తానే కథను అల్లానని ఒప్పుకుంది. తన ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకే ఈ పని చేశానని ఆ యువతి ఒప్పుకుంది.

Next Story
Share it