చనిపోయినట్లు నమ్మించి ప్రియుడితో జంప్.. సీసీ కెమెరాతో దొరికిపోయిన కిలాడీ భార్య!
భర్తను వదిలించుకుని ప్రియుడితో శాశ్వతంగా కలిసి ఉండాలనుకుంది. తాను మరణించానని నమ్మిస్తే ఎవరూ వెతకరని భావించి సినిమా తరహాలో ...
By - అంజి |
చనిపోయినట్లు నమ్మించి ప్రియుడితో జంప్.. సీసీ కెమెరాతో దొరికిపోయిన కిలాడీ భార్య!
భర్తను వదిలించుకుని ప్రియుడితో శాశ్వతంగా కలిసి ఉండాలనుకుంది. తాను మరణించానని నమ్మిస్తే ఎవరూ వెతకరని భావించి సినిమా తరహాలో మాస్టర్ ప్లాన్ వేసింది. కానీ, సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ లొకేషన్ ఆమె ఆటకట్టించాయి. కర్ణాటకలో కలకలం రేపిన ఈ 'డ్రామా' వివరాలు ఇలా ఉన్నాయి. తుమకూరు జిల్లా కుణిగల్‌కు చెందిన ప్రియాంక(29)కు, చిక్కమగళూరుకు చెందిన వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే, పెళ్లికి ముందే డేవిడ్ అనే యువకుడితో ఆమెకు ఉన్న ప్రేమ వివాహం తర్వాత కూడా కొనసాగింది.
ప్రియుడితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆమె, అందుకు సరైన సమయం కోసం వేచి చూసింది. గత శుక్రవారం హాసన తాలుకా కల్కెర గ్రామంలో జరుగుతున్న తన స్నేహితురాలి పెళ్లికి ప్రియాంక వెళ్ళింది. పెళ్లి ఇంట్లో అందరూ బిజీగా ఉన్న సమయంలో ఆమె మెల్లగా జారుకుంది. సమీపంలోని ఒక కాలువ గట్టు వద్ద తన దుస్తులు, పాదరక్షలు, ఇతర వస్తువులను వదిలేసింది. తద్వారా తాను కాలువలో పడి చనిపోయానని లేదా ఎవరో ఎత్తుకెళ్లి చంపేశారని తన భర్త, కుటుంబ సభ్యులు నమ్ముతారని ప్లాన్ వేసింది.
భార్య కనిపించకపోవడంతో ఆందోళన చెందిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఒంటిపై రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని, నగలు కాజేయడానికి ఎవరైనా ఆమెను హత్య చేసి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. భారీ మొత్తంలో బంగారం ఉండటంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. బేలూరు బస్టాండ్ సమీపంలోని ఫుటేజీని పరిశీలించగా, ప్రియాంక అక్కడ క్షేమంగా తిరుగుతున్నట్లు గుర్తించి పోలీసులు షాక్ తిన్నారు. వెంటనే ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్ ట్రాక్ చేయగా, ఆమె తన ప్రియుడు డేవిడ్‌తో కలిసి ఉన్నట్లు తేలింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.