సూర్యాపేట జిల్లాలో అమానుషం.. మహిళను వివస్త్రను చేసి.. కళ్లలో కారం కొట్టి
Woman Attacked in Suryapet District.ఓ హత్య కేసులో నిందితురాలి ఉన్న మహిళపై మృతుని కుటుంబ సభ్యులు
By తోట వంశీ కుమార్ Published on 30 Aug 2021 8:28 AM ISTఓ హత్య కేసులో నిందితురాలి ఉన్న మహిళపై మృతుని కుటుంబ సభ్యులు దారుణానికి తెగబడ్డారు. పట్టపగలు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆ మహిళ ఒంటిపై ఉన్న వస్త్రాలను తొలగించారు. ఆమెను నగ్నంగా చేసి కర్రలతో కొట్టారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం ఈ ఘటన జరుగగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. జూన్ 13న రాజునాయక్‌తండాకు చెందిన శంకర్‌నాయక్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. శంకర్ నాయక్ బంధువులతో పాత కక్షలు ఉండడంతో.. ఈ కేసులో సదరు గ్రామానికే చెందిన ఓ మహిళను అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. ఇటీవల ఆమె బెయిల్‌పై విడుదలైంది. సూర్యాపేటలోని తన సోదరి ఇంట్లో ఉంటోంది. కాగా.. తండాకు చెందిన బంధువు ఒకరు మృతి చెందడంతో.. ఆమె శనివారం తండాకు వెళ్లింది. శంకర్ నాయక్ హత్య అనంతరం తొలిసారి ఆ మహిళ అక్కడకు వెళ్లడంతో.. శంకర్ నాయక్ బంధువులు ఆమెను చూసి ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ఇంట్లో ఉన్న ఆమెను బయటకు లాక్కొచ్చారు. ఆమెను వివస్త్రను చేసి కళ్లలో కారం కొట్టి.. కర్రలతో కొడుతూ నగ్నంగా వీదుల్లో తిప్పారు. దాదాపు గంటసేపు ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు చూస్తూ నిలబడ్డారే తప్ప ఎవ్వరూ కూడా దీనిని అడ్డుకోలేదు. చివరకు వారి నుంచి తప్పించుకున్న మహిళ.. ఎంపీటీసీ సభ్యురాలు శాంతాబాయి ఇంటికి పరుగులు తీసింది. ఆమెకు దుస్తులు ఇచ్చి.. రక్షణ కల్పించారు శాంతాబాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య బాధితురాలిని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తనపై లునావత్ భారతి, బానోతు జ్యోతి, లునావత్ పద్మ, జ్యోతి, సునీత, పింప్లి, రాజేష్, సుప్రియ, కిషన్, మరో బాలిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.