ముగ్గురు చిన్నారులను హతమార్చి.. తల్లి ఆత్మహత్య
Woman 3 children found dead in Vellore.కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి
By తోట వంశీ కుమార్ Published on 25 Sept 2021 8:39 AM ISTకుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాము చనిపోతే.. పిల్లల ఎవరు చూడరనో లేక వాళ్లు అనాథలు అవుతారనో తెలీదు కానీ.. అభం, శుభం తెలియని ముగ్గురు పిల్లలను చంపిన అనంతరం తల్లి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన వేలూర్‌లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేలూరు తోటపాళ్యంకు చెందిన దినేష్‌కు సలవన్‌పేటకు చెందిన జీవిత(23)తో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి అక్షయ(5), నందకుమార్(4), 6 నెలల పాప సంతానం. వీరు సలవన్‌పేట కచ్చేరీ వీధిలో నివసిస్తున్నారు. కాగా.. దినేష్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన దినేష్ నిత్యం భార్యతో గొడవ పడేవాడు. ఆమెను చిత్ర హింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలో జీవిత తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. గురువారం ఉదయం భర్త ఇంటికి వెలుతున్నానని పుట్టింటిలో చెప్పి వెళ్లింది. దినేష్ ఉదయం 7 గంటలకే పనికి వెళ్లిపోయాడు. సాయంత్రం 5 గంటల సమయంలో జీవిత తల్లి.. ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిస్ట్ చేయలేదు.
దీంతో అనుమానం వచ్చి.. తన కుమారుడు జగదీశ్వరన్‌కు ఫోన్ చేసి వెళ్లి చూడమని చెప్పింది. అతను జీవిత ఇంటికి వెళ్లి చూడగా.. తలుపుకు లోపల గడియ పెట్టి ఉంది. కిటీలోంచి తలుపు గడియ తీసి లోనికి వెళ్లి చూడగా.. ముగ్గురు పిల్లలతో పాటు సోదరి జీవిత విగతజీవులుగా కనిపించారు. పిల్లలను చంపిన అనంతరం జీవిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త దినేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.