కరెంట్ షాక్‌తో భర్తను చంపేందుకు భార్య ప్లాన్.. చివరకు..
అక్రమ సంబంధం అంటగడుతూ రోజూ ఇబ్బంది పెడుతున్న భర్త వ్యవహరంతో భార్య విసిగిపోయింది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 11:27 AM ISTకరెంట్ షాక్‌తో భర్తను చంపేందుకు భార్య ప్లాన్.. చివరకు..
అక్రమ సంబంధం అంటగడుతూ రోజూ ఇబ్బంది పెడుతున్న భర్త వ్యవహరంతో భార్య విసిగిపోయింది. ఇక అతనితో జీవించడం ఇష్టం లేక.. భర్తనే చంపాలని నిర్ణయించుకుంది. కరెంటు షాక్‌తో భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. కానీ.. భర్త తల్లిదండ్రులు గమనించడం సీన్ రివర్స్ అయ్యింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం బోడ్కాతండాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడ్కాతండాకు చెందిన బాదావత్ బీకు, అదే గ్రామానికి చెందిన లీలకు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కొంతకాలం పాటు బాగానే సాగిన వీరి సంసారంలో అనుమానమే భూతం దాపురించింది. బీకు తరచూ భార్య లీలతో గొడపడేవాడు. అదేగ్రామానికి చెందిన కొందరితో లీల అక్రమ సంబంధం పెట్టుకుందని నిత్యం గొడవపడుతుండేవాడు. తాను ఏ తప్పు చేయలేదని భర్తతో చాలాసార్లు చెప్పింది. కానీ అతను ఏమాత్రం భార్యను నమ్మలేదు. పైగా మద్యం సేవించి ఇంటికి వచ్చి నరకం చూపించడం మొదలుపెట్టాడు. భర్త తీరుతో విసిగిపోయిన లీల చివరకు అతన్ని చంపేందుకు నిర్ణయం తీసుకుంది.
జనవరి 10వ తేదీన రాత్రి మద్యం తాగి వచ్చిన బీకు మరోసారి లీలతో గొడపడ్డాడు. ఆ తర్వాత ఇంటి బయట పడుకున్నాడు. రాత్రి భర్త వద్దకు వెళ్లి లీల.. నిద్రపోతున్నట్లు నిర్ధారించుకుంది. ఇదే అదునుగా భావించి బీకూ రెండు చేతులను తాడుతో కట్టేసింది. ఆ తర్వాత కరెంటు వైర్లు కూడా చుట్టింది. ఇక చివరకు ఇంట్లో స్విచ్‌బోర్డులో కనెక్షన్ ఇచ్చి.. ఆన్ కూడా చేసింది. కరెంట్ షాక్‌తో బీకు విలవిల్లాడుతూ అరవసాగాడు. దాంతో.. కొడుకు అరుపులు విన్న తల్లిదండ్రులు మేల్కొని జరుగుతున్నదంతా అర్ధం చేసుకున్నారు. వెంటనే స్విచ్‌ఆఫ్ చేసి బీకు చుట్టూ ఉన్న విద్యుత్ తీగలను తొలగించారు. అయితే.. అప్పటికే బీకు అపస్మారకస్థితిలోకి వెళ్ళాడు. అతన్ని తల్లిదండ్రులు మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు భార్య లీలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.