ప్రియుడి మోజులో భర్తను చంపిన కానిస్టేబుల్ భార్య..ఉద్యోగం కోసం..
ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ భర్తను కడతేర్చించింది. రాత్రి పడుకున్నాక దిండుతో ఊపిరాడకుండా చేసి చంపింది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2023 8:27 AM ISTప్రియుడి మోజులో భర్తను చంపిన కానిస్టేబుల్ భార్య..ఉద్యోగం కోసం..
వివాహేత సంబంధాలు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈ మద్య కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. పెళ్లి తర్వాత జీవిత భాగస్వామిని కాదని.. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. సరికాదని చెప్పినందుకు ఎదుటివారి ప్రాణాలు తీస్తున్నారు. విశాఖపట్నంలోనూ ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ భర్తను కడతేర్చించింది. రాత్రి పడుకున్నాక దిండుతో ఊపిరాడకుండా చేసి చంపింది. భర్త కానిస్టేబుల్‌ను హత్య చేశాక అతడి ఉద్యోగంపై కన్నువేసింది. అందుకుగాను తన భర్త గుండెపోటుతో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ.. ఆమె చేసిన పొరపాట్లే ఆమెను పోలీసులకు పట్టించాయి.
విశాఖనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బర్రి రమేశ్ (40) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య శివజ్యోతితో కలిసి ఎంవీపీ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే.. ఎదురింట్లో ఉంటోన్న రామారావుతో శివజ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. రామారావు వీరి ఇంటి పక్కనే కారు పార్క్ చేసేవాడు. ఆ విధంగా వీరిమధ్య పరిచయం పెరిగి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఒకానొక క్రమంలో శివజ్యోతి, రామారావు సన్నిహితంగా ఉండటం రమేశ్ చూశాడు. దాంతో.. రామారావుతో గొడవకూడా పెట్టుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు శివజ్యోతి, రామారావు బయటకు వెళ్లిపోయారు. ఇరు వర్గాల కుటుంబ సభ్యులే రమేశ్‌కు నచ్చజెప్పి మళ్లీ శివజ్యోతిని తీసుకొచ్చి రమేశ్ వద్ద వదిలివెళ్లారు. కానీ గొడవలు మాత్రం ఆగలేదు. దాంతో.. రామారావు దగ్గరికే వెళ్లిపోవాలని తన భార్య శివజ్యోతికి చెప్పాడు రమేశ్. దానికి వెళ్తాను కానీ.. పిల్లలను తన వెంటే తీసకెళ్తానని చెప్పింది. దానికి రమేశ్ ఒప్పుకోలేదు. ఈ విషయంలో రోజూ గొడవలు జరిగేవి.
ప్రియుడి మోజులో పడ్డ శివజ్యోతికి.. భర్తను అడ్డు తొలగించుకోవాలనే ఆలోచన వచ్చింది. అంతేకాక.. సాధారణ మరణంగా చిత్రీకరిస్తే ఉద్యోగం లభిస్తుందని ఆశపడింది. దాంతో రామారావుతో కలిసి ఓ పథకం వేసింది. ఆమె వద్ద ఉన్న బంగారం రూ.1.50 లక్షలకు అమ్మి.. అప్ఫుఘర్‌కు చెందిన వెల్డింగ్ పనులు చేసే నీలాకు సుపారీ ఇచ్చింది. ఆగస్టు ఒకటో తేదీ రాత్రి రమేష్ ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రపోయాడు. ప్లాన్ ప్రకారం నీలాను పిలిచారు. రమేశ్ ముఖంపై నీలా దిండుపెట్టి గట్టిగా అదిమిపట్టుకోగా.. అతను తప్పించుకోకుండా శివజ్యోతి కాళ్లు పట్టుకుని ప్రాణాలు తీశారు. ఆ సమయంలో ఇంట్లోకి ఎవరూ రాకుండా రామారావు ఇంటి బయటే ఉండి కాపాలా కాశాడు.
ఇక హత్య తర్వాత భర్త గుండెపోటుతో మరణించాడని భార్య శివజ్యోతి నాటకం మొదలుపెట్టింది. తాము అన్యోన్యంగానే ఉండేవారమని వీడియోలు చూపించసాగింది. అనుమానస్పదంగా అనిపించడంతో పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా ఊపిరాడక మృతిచెందాడని తేలడంతో.. శివజ్యోతిని గట్టిగా నిలదీశాడు. దాంతో.. నిజాలన్నీ వెలుగులోకి వచ్చాయి. దాంతో.. ఏ1గా శివజ్యోతి, ఏ2గా రామారావు, ఏ3గా నీలాను పోలీసులు అరెస్ట్ చేశారు.