ఘట్కేసర్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2023 6:30 PM ISTఘట్కేసర్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సంగారెడ్డి జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుక్కప్ప (55), ఈశ్వరమ్మ (40) అనే మహిళను పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. కాగా.. అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్(35) అనే వ్యక్తితో ఈశ్వరమ్మకు పరిచయం ఏర్పడింది. పరిచయం కార్త క్లోజ్ అయి వివాహేతర సంబంధం వరకూ వెళ్లింది. విషయం తెలిసిన తుక్కప్ప.. ఇద్దరినీ పలుమార్లు మందలించాడు. అయినా ఈశ్వరమ్మలో మార్పు రాలేదు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని చూస్తోంది ఈశ్వరమ్మ. ఈ క్రమంలోనే ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. కాగా.. కొన్ని రోజుల నుంచి తుక్కప్ప పక్షవాతంతో బాధపడుతున్నాడు. అనారోగ్యంతో ఉన్న తుక్కప్పను మెరుగైన వైద్యం అంటూ కౌకూర్ దర్గా వద్దకు ఈశ్వరమ్మ తీసుకెళ్లింది. అనంతరం ఘట్కేసర్‌లో డాక్టర్ వద్దకు వెళ్దామని మాయ మాటలు చెప్పి యంనంపేట చౌరస్తాకు తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లాక డాక్టర్ అందుబాటులో లేడని భర్తకు చెప్పింది ఈశ్వరమ్మ. ఇక చేసేదేం లేక ఇంటికి తిరిగి వెళ్లిపోదామని అనుకున్నాడు తుక్కప్ప. కానీ.. భార్య ఈశ్వరమ్మ ఎలాగూ బయటకు వచ్చాం.. ఇక్కడే వైన్స్ ఉంది తాగేసి వెళ్దామని చెప్పింది. అప్పటికే రోజూ మద్యం సేవించే అలవాటు ఉండటంతో అతను కూడా సరే అన్నాడు. ఈశ్వరమ్మే స్వయంగా మద్యం కొనుగోలు చేసింది.
ఇక అంతకుముందే బస్టాండ్ దగ్గర ఫెర్టిలైజర్ షాపులో ఈశ్వరమ్మ ప్రియుడు శ్రీనివాస్ పురుగుల మందు కొనుగోలు చేశాడు. అది తీసుకొచ్చి ప్రియురాలికి ఇచ్చాడు. దాన్ని ఈశ్వరమ్మ తన భర్తకు తెలియకుండా మద్యంలో కలిపేసింది. ఆ తర్వాత పురుగుల మందు కలిపిన మద్యాన్నే తాగమని భర్తకు ఇచ్చింది. ఇవన్నీ ఏమీ తెలియని భర్త మందు గడగడా తాగేశాడు. ఆ తర్వాత కాసేపటికే స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. ఈశ్వరమ్మ తనకేమీ తెలియదు అన్నట్లుగా.. అంబులెన్స్‌లో భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే తుక్కప్ప చనిపోయాడు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పురుగుల మందు తాగి చనిపోయాడని తేలడంతో పోలీసులు ఆమెను గట్టిగా నిలదీసి అడిగారు. దాంతో ఆమె జరిగిన విషయం అంతా చెప్పేసింది. పోలీసులు ఈశ్వరమ్మతో పాటు, ప్రియుడు శ్రీనివాస్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.