కర్ణాటకలో జనవరి 30న జరిగిన పరమేష్ అనే వ్యక్తి మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరమేష్ మరణించిన సమయంలో, అతని భార్య ఆశా అది 'గుండెపోటు' అని బంధువులను నమ్మించింది. ఎవరికీ అనుమానం రాకుండా హడావుడిగా అంత్యక్రియలు కూడా పూర్తి చేయించింది. అయితే, భర్త చనిపోయిన కేవలం 20 రోజులకే ఆశా తన స్నేహితుడు చంద్రప్పను వివాహం చేసుకోవడం పెను దుమారం రేపింది. భర్త మరణించిన విషాదం కూడా లేకుండా అంత వేగంగా రెండో పెళ్లి చేసుకోవడంతో పరమేష్ సోదరీమణులకు అనుమానం కలిగింది. వారు వెంటనే హెబ్బూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తహశీల్దార్ మరియు రెవెన్యూ అధికారుల సమక్షంలో పరమేష్ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి (Exhumation), పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ విచారణలో అది సహజ మరణం కాదని తేలింది. పోలీసులు ఆశా, చంద్రప్పలను తమదైన శైలిలో విచారించగా, వారు నిజాన్ని అంగీకరించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం.. జనవరి 30 రాత్రి ఆశా, చంద్రప్ప కలిసి నిద్రిస్తున్న పరమేష్‌ను దిండుతో ముఖంపై గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అది హార్ట్ ఎటాక్ అని కథ అల్లారు. ప్రస్తుతం హెబ్బూర్ పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.