దారుణం.. కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 2:15 PM ISTదారుణం.. కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త రోజు వేధిస్తుండటంతో తాళలేక భార్య దారుణానికి పాల్పడింది. కుమారుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసింది. ఈ సంఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.
దుగ్గొండి గ్రామీణ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జేరిపోతుల రాజు (55)కి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కూతళ్ల వివాహాలు జరిపంచాడు. అయితే.. పెద్ద కొడుకు ప్రశాంత్ హైదరాబాద్‌లో ఉంటూ ఓ దుకాణంలో పనిచేసుకుంటున్నాడు. రాజు రెండేళ్ల క్రితం ఉపాధి కోసం భార్య లక్ష్మీ, చిన్న కుమారుడు సూర్యతో కలిసి వరంగల్‌లోని జక్కలొద్దికి వచ్చారు. పనులు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. రాజు మద్యానికి బానిస అయ్యాడు. దాంతో రోజూ తాగి వచ్చి ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. డబ్బులు అడిగేవాడు. అంతేకాక.. కొత్తగా అనుమానం పెంచుకుని వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ఇటీవల రాజు కుటుంబ సభ్యులు బోనాల పండుగ కోసం మైనంపల్లికి వెళ్లారు. శుక్రవారం రాత్రి పండగ చేసుకున్నాడు. ఆ సమయంలో మద్యం సేవించిన రాజు.. మరోసారి భార్య లక్ష్మితో గొడవకు దిగాడు. వద్దని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినలేదు. దాంతో.. భార్య లక్ష్మీ, చిన్నకుమారుడు సూర్య, పెద్ద కుమార్తె మాధవి, అల్లుడు రాకేశ్, మరో వ్యక్తి రాళ్లతో రాజును కొట్టారు. అనంతరం మెడకు తీగ బిగించి హతమార్చారు. శనివారం తెల్లవారుజామున అక్కడి నుంచి పారిపోయారు. ఇక ఉదయం రాజు డెడ్‌బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. పెద్ద కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఐదుగురిని నిందితులుగా చేర్చి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగా.. పెద్ద కుమారుడు ప్రశాంత్‌కు అంతకుముందే తండ్రి రాజు ఫోన్‌కాల్ చేశాడు. లక్ష్మి, చిన్నకుమారుడు సూర్య చంపుతామని బెదిరిస్తున్నట్లు ఫోన్లో ప్రశాంత్‌కు చెప్పాడు. శుక్రవారమే ఈ కాల్ చేయగా.. శనివారం దారుణంగా చంపేశారని పెద్దకుమారుడు పోలీసులకు తెలిపాడు.