భర్తను కిరాతకంగా చంపిన భార్య.. సాయం చేసిన అత్త
కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 9 Sep 2024 5:29 AM GMTకృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య కట్టుకున్న భర్తను కడతేర్చింది. నిద్రలో ఉన్న సమయంలో దారుణంగా కర్రలతో కొట్టి చంపేసింది. భార్య భర్తను చంపుతుంటే.. అత్త ఆమె సాయం చేసింది. రెండ్రోజుల క్రితం ఈ సంఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామానికి చెందిన కన్నికంటి రామభూషణం (53) అనే వ్యక్తి బొమ్ములూరులో నివాసం ఉంటున్నాడు. కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్నాడు. అయితే.. అంతకుముందు తెలంగాణలోని మంచిర్యాలలో నివాసం ఉండి వ్యాపారం చేశాడు. కొన్నేళ్ల క్రితమే బొమ్ములూరుకి వెళ్లి వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే.. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉండగా వారి వివాహాలు కూడా చేశాడు. అన్ని సక్రమంగానే ఉన్నాయని అనుకుంటున్న క్రమంలో దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. తరచూ గొడవపడేవారు. నాగశిరోమణి భర్తపై కోపం పెంచుకుని ఎలాగైనా చంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే గత శుక్రవారం రాత్రి భర్త రామభూషణం పడుకున్న తర్వాత హత్యకు ప్లాన్ చేసింది. రామభూషణం పడుకున్న సమయంలో భార్యతో పాటుగా అత్త ఝాన్సీలక్ష్మీ కలిసి కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా తలపై బాదారు. దాంతో.. తీవ్రంగా గాయపడి రక్తస్రావమైన రామభూషణం అక్కడే చనిపోయాడు.
మృతుడి సోదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి ఆదివారం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. భర్త వేధింపులతో విసిగిపోయినందుకే భార్య నాగశిరోమణి ఈ హత్యకు పాల్పడినట్లుగా విచారణలో తెలిసిందని పోలీసులు చెప్పారు.