విషాదం.. భర్త చెంపపై కొట్టడంతో మృతిచెందిన భార్య

ఓ భర్త కూడా తన భార్యతో ఘర్షణ పడ్డాడు. కోపంలో భార్య చెంపపై గట్టిగా కొట్టాడు.

By Srikanth Gundamalla  Published on  6 March 2024 11:28 AM IST
wife, death,  husband, hit, andhra pradesh,

విషాదం.. భర్త చెంపపై కొట్టడంతో మృతిచెందిన భార్య

భార్య భర్తలు అన్నాక గొడవలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు స్వల్పంగా ఘర్షణలు కూడా జరుగుతాయి. అదంతా మర్చిపోయి మళ్లీ మాములుగా ఉండేవారు ఉన్నారు. అయితే.. తాజాగా ఓ భర్త కూడా తన భార్యతో ఘర్షణ పడ్డాడు. కోపంలో భార్య చెంపపై గట్టిగా కొట్టాడు. అంతే ఆమె ఆ దెబ్బతోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

కొవ్వూరు మండలం మద్దూరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దూరుకు చెందిన సండ్ర వీరబాబు, అత్తిలి గ్రామానికి చెందిన లావణ్య సాయిదీపికతో 2010లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరబాబు తాపీ పని చేస్తుంటాడు. మద్యానికి, పేకట, కోడి పందాలకు బానిస అయ్యాడు. ఈ విషయాల్లోనే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. మార్చి 5న కూడా ఇద్దరి మధ్య డ్వాక్రా రుణానికి సంబంధించిన వాయిదా డబ్బుల చెల్లింపు విసయంలో ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో కోపంతో వీరబాబు తన భార్య చెంపపై గట్టిగా కొట్టాడు.దాంతో.. మాట లేకుండా ఆమె కిందపడిపోయింది. ఇదే విషయాన్ని వీరబాబు తన అత్తమామలకు చెప్పాడు.

లావణ్య తల్లిదండ్రులు కూడా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. లావణ్య చనిపోయిన విషయాన్ని తెలుసుకున్నారు. పోలీసులు కూడా ఈ సమాచారం తెలుసుకుని అక్కడకు వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. బంధువులను విచారించారు. మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు వీరబాబుని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు నమోదు చేశారు. పెళ్లి జరిగినప్పటి నుంచి తమ కూతురు లావణ్యను వీరబాబు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. అన్యాయంగా కొట్టి చంపేశాడంటూ కన్నీరుపెట్టుకుంటున్నారు. లావణ్య మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Next Story