పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకి సెలవు కోసం ఎనిమిదో తరగతికి చెందిన బాలుడు ఒకటవ తరగతి విద్యార్థిని చెరువులో ముంచి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పాఠశాల నుంచి తప్పిపోయిన ఒకటో తరగతి విద్యార్థి రెండు రోజుల తర్వాత పాఠశాల సమీపంలోని చెరువులో శవమై కనిపించాడు. పోలీసుల విచారణలో సీనియర్ విద్యార్థి హత్య చేయడం సంచలనం రేపింది. ఒకటో తరగతి విద్యార్థి జనవరి 30వ తేదీన ఓ ప్రైవేట్ పాఠశాలలో మధ్యాహ్న లంచ్ బ్రేక్ సమయంలో అదృశ్యమయ్యాడు. భారీ గాలింపు చర్యల తర్వాత, అతని మృతదేహం పాఠశాల నుండి 400 మీటర్ల దూరంలో ఉన్న చెరువులో కనుగొనబడింది.
పోస్టుమార్టం రిపోర్టులో చిన్నారి తలపై బలంగా కొట్టినట్లు ఆధాలున్నాయి. పోలీసులు బాలుని మరణంపై దర్యాప్తు ప్రారంభించినప్పుడు, అనేక ఆధారాలు అదే పాఠశాలలోని ఎనిమిదో తరగతి విద్యార్థి పాత్రను చూపాయి. బాలుడు అదృశ్యమైనప్పటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థి పాఠశాలకు గైర్హాజరై ఉన్నాడని పోలీసులు గుర్తించారు. అతడిని పోలీసులు విచారించగా, బాలుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు. బాలుడి హత్యకు నిందితుడి కారణం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. బాలుడు స్కూల్‌కు సెలవు కోసం మొదటి తరగతి విద్యార్థిని హత్య చేసాడు. పాఠశాలలో ఎవరైనా మరణిస్తే సెలవు వస్తుందని అనుకున్నాడు. పాఠశాలకు సెలవు దొరికిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లాలనుకున్నాడని పురూలియా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిజిత్ బెనర్జీ తెలిపారు.