తెల్ల‌వారితే వివాహం జరగాల్సిన ఇంట విషాదం

Wedding tragedy in Jagtial District.తెల్ల‌వారితే ఆ ఇంట బాజాభ‌జంత్రీలు మోగ‌నున్నాయి. దీంతో ఆ ఇంట సంద‌డి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2022 2:24 AM GMT
తెల్ల‌వారితే వివాహం జరగాల్సిన ఇంట విషాదం

తెల్ల‌వారితే ఆ ఇంట బాజాభ‌జంత్రీలు మోగ‌నున్నాయి. దీంతో ఆ ఇంట సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్ల‌లో అంద‌రూ మునిగిపోయారు. అయితే.. వివాహ ఏర్పాట్ల‌లో ఉన్న బావ‌మ‌రిదిపై బావ గొడ్డ‌లితో దాడి చేసి హ‌త‌మార్చాడు. దీంతో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. ఈ దారుణ ఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా రూరల్‌ మండలంలోని పొలాస గ్రామానికి చెందిన పౌలస్తేశ్వ‌ర‌స్వామి దేవ‌స్థానం ఛైర్మ‌న్ వీర్ల శంక‌ర్‌(48) త‌న సోద‌రి జ‌మున‌ను అంబారిపేట గ్రామానికి చెందిన వెంక‌టేశ్‌కు ఇచ్చి ఇర‌వై ఏళ్ల క్రితం వివాహం చేశారు. కాగా.. వెంక‌టేశ్‌-జ‌మున‌కు ప్ర‌వ‌ళ్లిక‌, పూజిత సంతానం. అయితే.. తొమ్మిదేళ్ల క్రితం మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా వెంక‌టేశ్‌-జ‌మున విడిపోయారు. ఆ స‌మ‌యంలో జ‌మున పేరు మీద మూడున్నర ఎకరాల భూమిని వెంక‌టేశ్‌ రిజిస్ట్రేషన్ చేసి.. అదే గ్రామంలో వేరుగా ఉంటున్నాడు. అప్పటి నుంచి జ‌మున సోద‌రుడు వీర్ల శంకర్‌కు వెంకటేష్‌ మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఇటీవ‌ల జ‌మున పేరు మీద ఉన్న మూడున్న‌ర ఎక‌రాల భూమిలో కొంత విక్ర‌యించిన వెంక‌టేశ్‌.. ఆమె కుమారై ప్ర‌వ‌ళ్లిక వివాహాన్ని పొలాస గ్రామానికి చెందిన ఓ యువకునితో చేసేందుకు నిశ్చ‌యించారు. ఈ నెల 3న పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్ల కోసం తన స్నేహితుడు గుగ్గిళ్ల మల్లయ్య, అతని తల్లి చిన్నమ్మలతో కలిసి వెంక‌టేశ్ బుధ‌వారం సాయంత్రం పందిరి కొట్టుకు రావడానికి వెళ్లాడు. త‌న భూమిని విక్ర‌యించాడు అన్న కోపంతో బావ మ‌రిది శంక‌ర్‌పై వెంక‌టేష్ గొడ్డ‌లితో దాడి చేశాడు. అడ్డుకోవ‌డానికి య‌త్నించిన వారిపైనా దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన శంక‌ర్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించేలోపు మ‌ర‌ణించాడు. మల్లయ్య, చిన్నమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని జ‌గిత్యాల ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌తో తెల్లవారితే శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం నిండింది.

Next Story
Share it