తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలలో ఓ వీఆర్‌ఏ దారుణ హత్యకు గరయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కన్నెపల్లిలోని తహశీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. వీఆర్‌ఏ దుర్గం బాబును కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయంలో దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇవాళ ఉదయం తహశీల్దార్ కార్యాలయం వైపు వెళ్లిన స్థానికులు.. రక్తం మడుగులో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు కొత్తపల్లి వీఆర్‌ఏగా పని చేస్తున్న దుర్గంబాబుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి.. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. దుర్గం బాబు హత్యకు గురయ్యాడనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.