విశాఖలో బంగారం కోసం వృద్ధురాలిని చంపిన వాలంటీర్

విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం ఓ వృద్ధురాలిని వాలంటీర్‌ కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు.

By Srikanth Gundamalla  Published on  31 July 2023 11:38 AM IST
Volunteer, killed, old woman, gold, Vizag,

విశాఖలో బంగారం కోసం వృద్ధురాలిని చంపిన వాలంటీర్

విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. వార్డు వాలంటీర్‌ దారుణానికి ఒడిగట్టాడు. బంగారం కోసం ఓ వృద్ధురాలిని కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘాతుక సంఘటన నగరంలోని పెందుర్తి పరిధిలోని సుజాతనగర్‌లో జరిగింది.

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాతనగర్‌లో నివాసం ఉంటున్న కోటగిరి శ్రీనివాస్‌ జీవీఎంసీ 95వ వార్డు పురుషోత్తపురంలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ నిర్వహిస్తున్నాడు. శ్రీనివాస్‌ వద్ద పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన వార్డు వాలంటీర్ రాయవరపు వెంకటేశ్ (26) పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడు. అయితే.. ఆదివారం రాత్రి 10 గంటలకు శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లాడు వెంకటేశ్. తిరిగి మళ్లీ దుకాణం వద్దకు వెళ్లాడు. వెంకటేశ్‌ అలా ఇంటికి వెళ్లివచ్చినప్పుడు అక్కడ ఎవరూ లేరని తెలుస్తోంది.

కోటగిరి శ్రీనివాస్ ఇక పని ముగిశాక అర్దరాత్రి 12.30 గంటలకు ఇంటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లి చూసే సరికి ఆయన తల్లి వరలక్ష్మి (72) మంచంపై అచేతనంగా పడి ఉంది. అనుమానం వచ్చి లేపేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఉలుకూ పలుకు లేకుండా ఉంది. అంతేకాక ఆమె మెడలో ఉండాల్సిన బంగారం కూడా కనిపించలేదు. ఆందోళనకు గురైన శ్రీనివాస్‌ డయల్ 100కు కాల్‌ చేశారు. వెంటనే శ్రీనివాస్ ఇంటికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. శ్రీనివాస్‌ వద్ద పనిచేస్తున్న వాలంటీర్‌ వెంకటేశ్‌ వచ్చి వెళ్లినట్లు కెమెరాల్లో రికార్డు అయ్యింది. అతనొక్కడే ఇంటికి వచ్చి వెళ్లడంతో వెంకటేశ్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంగారం అతడే తీసుకెళ్లి ఉంటాడని అంటున్నారు.

ప్రస్తుతం వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు దొంగిలించడానికి వాలంటీర్ ఆమెను తలగడతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story