ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికి దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రతి నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామంధులు దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా.. ఓ వాలంటీర్ దుర్మార్గానికి తెర లేపాడు. ఏకంగా గ్రామ సచివాలయంలోనే బాలిక పై వాలంటీర్ లైంగిక దాడి చేశాడు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వీరఘట్టం మండలం నడుకూరు సచివాలయంలో బొత్స హరిప్రసాద్ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. గత నెల చివరిన(అక్టోబర్ 31)న ఓ బాలికకు మాయ మాటలు చెప్పి సచివాలయంలోకి తీసుకువచ్చాడు. అక్కడే తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న రాంబాబు.. హరిప్రసాద్‌కు సహకరించాడు. అతడు బయటకు వచ్చి తలుపులు మూసి తాళం వేసి బయట ఉన్నాడు. హరిప్రసాద్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక అపస్మారస్థితిలోకి వెళ్లిపోయింది. కొద్ది సేపటి తరువాత తేరుకున్న బాలిక ఇంటికి వెళ్లిపోయింది.
బాధితురాలి సోదరికి అనుమానం వచ్చి ఆరా తీయగా.. అసలు విషయాన్ని చెప్పింది. తల్లిదండ్రులు ఊర్లో లేకపోవడంతో వారు రాగానే.. ఈ నెల 3 వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.