Vikarabad: ఔటర్‌రింగ్‌ రోడ్డు వద్ద మూటలో డెడ్‌బాడీ కలకలం

వికారాబాద్‌ జిల్లాలోని బ్రాహ్మనపల్లి ఔటర్‌ రింగ్‌రోడ్డు దగ్గర మూటలో మృతదేహం కలకలం రేపింది.

By Srikanth Gundamalla  Published on  16 Jan 2024 1:00 PM IST
vikarabad, crime, orr, dead body,

Vikarabad: ఔటర్‌రింగ్‌ రోడ్డు వద్ద మూటలో డెడ్‌బాడీ కలకలం

వికారాబాద్‌ జిల్లాలోని బ్రాహ్మనపల్లి ఔటర్‌ రింగ్‌రోడ్డు దగ్గర మూటలో మృతదేహం కలకలం రేపింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి ఔటర్‌ రింగ్‌ రోడ్డు పైనుంచి కిందకు పడేశారు. అయితే.. అక్కడ దుర్వాసన రావడం... మూట అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు మూటను చూశారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

ఇక స్థానికుల సమాచారంతో పోలసీఉలు సంఘటనాస్థలానికి వెళ్లారు. గోనెసంచిని విప్పి చూడగా అందులో ఒక మహిళ మృతదేహం కనిపించింది. వికారాబాద్‌ మండలం పూలుమద్ది గ్రామ శివారులో ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మూటలో మహిళ మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. కాగా.. మూటలో ఉన్న మహిళ మృతదేహం గుర్తుపట్టరాని స్థితిలో ఉన్నట్లు చెప్పారు. ఆమె వయసు 30 నుంచి 35 ఏళ్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ్రీన్‌ కలర్‌ జాకెట్‌, లైట్‌ గ్రీన్‌ కలర్‌ చీర కట్టుకుని ఉందని పోలీసులు తెలిపారు. ఇక ముక్కుకు రెండు వైపులా ముక్కుపుడకలు ఉన్నాయని చెప్పారు.

తెలిసినవారే తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోచోట హత్య చేసి ఆ తర్వాత డెడ్‌బాడీని మూటలో కట్టి పూలుమద్ది ప్రాంతంలో పడేసినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక క్లూస్ టీమ్‌కు సమాచారం ఇవ్వడంతో వారు కూడా సంఘటనాస్థలానికి వెళ్లారు. ఆధారాలను సేకరిస్తున్నారు. ఇక పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ చెప్పారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story