Vijayawada: గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ పాఠంతో.. కన్నతండ్రి లైంగిక వేధింపులకు చెక్ పెట్టిన బాలిక
చిన్నారుల హక్కులు, రక్షణపై పాఠశాలల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
By - అంజి |
Vijayawada: గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ పాఠంతో.. కన్నతండ్రి లైంగిక వేధింపులకు చెక్ పెట్టిన బాలిక
విజయవాడ: చిన్నారుల హక్కులు, రక్షణపై పాఠశాలల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తనపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న కన్నతండ్రిపై ఓ 13 ఏళ్ల బాలిక ధైర్యంగా పోరాడి అతడిని కటకటాల వెనక్కి నెట్టింది. విజయవాడ (టూ టౌన్) పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని, గత కొన్ని రోజులుగా తన తండ్రి తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తన ఉపాధ్యాయురాలికి వివరించింది.
మద్యం, గంజాయికి బానిసైన ఆ వ్యక్తి, మత్తులో కన్నకూతురు అని కూడా చూడకుండా లైంగికంగా వేధిస్తున్నాడని ఆ చిన్నారి కన్నీరు పెట్టుకుంది. బాలిక చెప్పిన విషయాలను విని నిర్ఘాంతపోయిన ఉపాధ్యాయురాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెస్ట్ జోన్ ఏసీపీ ఎన్.ఎస్.వి.కె. దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు బాలిక తల్లి గతంలోనే మరణించింది, అప్పటి నుండి ఆమె తండ్రి వద్దే ఉంటోంది. బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం పంపారు.
ప్రస్తుతం ఆ చిన్నారిని సురక్షితంగా రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇటీవల పాఠశాలలో నిర్వహించిన 'గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్' అవగాహన సదస్సు ఆ బాలికలో ఎంతో ధైర్యాన్ని నింపిందని తెలిపారు. తన తండ్రి ప్రవర్తన తప్పు అని గ్రహించిన ఆ చిన్నారి, ఆ ధైర్యంతోనే ఉపాధ్యాయురాలికి విషయం చెప్పగలిగిందని వారు పేర్కొన్నారు.