Uttar Pradesh girl attacks boyfriend with acid for infidelity.తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఓ యువతి తన ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది.
ఇప్పటి వరకు ప్రియురాలిపై ప్రియుడు దాడి చేసిన సందర్భాలే చూశాం.. అక్కడడక్క అమ్మాయిలు కూడా ఇలాంటి ఘటనలు పాల్పడ్డ సందర్భాలు కూడా లేకపోలేదు.. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఓ యువతి తన ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో సదరు యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఆగ్రాకు చెందిన దేవేంద్ర రాజ్‌పుత్(28), సోనమ్ లు ఒకే చోట పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు.
దీంతో వారిద్దరూ ఓ గదిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. అయితే.. ఇటీవల దేవేంద్ర రాజ్‌పుత్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఓ అమ్మాయితో పెళ్లిని నిశ్చయించారు అతడి తల్లిదండ్రులు. ఇందుకు దేవేంద్ర కూడా ఒప్పుకున్నాడు. దీంతో తనను కాదని వేరే యువతితో దేవేంద్ర పెళ్లికి రెడీ కావడంతో సోనమ్ రగిలిపోయింది. అనుకున్న పథకం ప్రకారం సీలింగ్ ఫ్యాన్ రిపేరులో ఉందని దేవేంద్రను రూమ్‌కి పిలించింది. అదును చూసుకుని అతడిపై యాసిడ్ పోసింది. యాసిడ్ మీద పడడంతో బాధకు తాళలేక అతడు గట్టిగా అరవడంతో చుట్టుప్రక్కల వారు అక్కడకు చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. తీవ్రగాయాలు కావడంతో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోనమ్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.