ట్విట్టర్‌ ఇండియా ఎండీకి యూపీ పోలీసుల నోటీసు..!

UP Police has sent notice to twitter india's MD.ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట‌ర్ ఇండియా మేనేజింగ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2021 5:54 AM GMT
ట్విట్టర్‌ ఇండియా ఎండీకి యూపీ పోలీసుల నోటీసు..!

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట‌ర్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా ఉన్న మ‌నీషా మ‌హేశ్వ‌రీకి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు లీగ‌ల్ నోటీసు పంపారు. మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు కొంద‌రు ట్విట‌ర్‌ను ఉప‌యోగించుకున్నార‌ని.. దీనిపై వారం రోజుల్లోగా లోనీ బోర్డ‌ర్ పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆనోటీసుల్లో పేర్కొన్నారు. ''ట్విటర్‌ మాధ్యమాన్ని ఉపయోగించి కొందరు ఆ వీడియోల్ని వైరల్‌ చేశారు. కానీ, ట్విటర్‌ మాత్రం ఆ అకౌంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సంఘ విద్రోహ శక్తుల సందేశాల్ని అలా ఎలా జనాలకు చేరవేస్తారు? అంటూ ఆనోటీసుల్లో పోలీసులు ట్విటర్‌ ఎండీని ప్రశ్నించారు.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి జరిగిన సంగ‌తి తెలిసిందే. నకిలీ యంత్రాలు విక్రయించారే కోపంతో సదరు వ్యక్తిపై ఆరుగురు దాడి చేశారని, ఇందులో హిందువులు, ముస్లింలు సైతం ఉన్నారని పేర్కొన్నారు. అయితే, దాడి ఆరోపణలకు సంబంధించిన వీడియోను కొందరు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. థర్డ్‌ పార్టీ కంటెంట్‌ను కలిగి ఉందని, దాన్ని తొలగించలేదంటూ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఇదే కేసులో పలువురు జర్నలస్టులు, కొందరు నాయకులపై సైతం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

భార‌త్‌లో నూత‌న ఐటీ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌చ్చిన త‌రువాత ట్విట‌ర్‌పై కేసు న‌మోదు అవ్వ‌డం ఇదే తొలి సారి. కొత్త ఐటీ నిబంధ‌న‌లు పాటించ‌నందుకు మ‌ధ్య‌వ‌ర్తి హోదాను ట్విటర్ కోల్పోయింది. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం ఫిర్యాదుల ప‌రిష్కారానికి ప్ర‌త్యేకంగా అధికారుల‌ను నియ‌మించాల‌ని ప‌లుమార్లు సూచించినా ట్విట‌ర్ పట్టించుకోక‌పోవ‌డంతో కేంద్రం ఈ సౌక‌ర్యాన్ని తొల‌గించింది. దీంతో ఎవ‌రైనా చ‌ట్ట‌వ్య‌తిరేకమైన స‌మాచారాన్ని పెడితే థ‌ర్డ్ పార్టీ కింద ట్విట‌ర్‌పై భార‌తీయ చ‌ట్టాల ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకునే వీలుంది.


Next Story