ఉత్తరప్రదేశ్‌లో ఒక విస్తుపోయే నేరం వెలుగులోకి వచ్చింది. తన అత్తపై ఉన్న ఏకపక్ష ప్రేమే లక్ష్యంగా, అడ్డుగా ఉన్నాడని భావించిన మేనమామను దారుణంగా హత్య చేశాడు ఓ మేనల్లుడు. రాంపూర్ జిల్లాలో మార్చి 13 రాత్రి జరిగిన ఈ ఘటన తొలుత రోడ్డు ప్రమాదంగా అందరూ భావించినప్పటికీ, పోలీసుల లోతైన విచారణలో అసలు నిజం బయటపడింది. నిందితుడు వీరేంద్ర తన స్నేహితుడు జితేంద్ర అలియాస్ ఛోటూతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఘటనా స్థలంలో బాధితుడి మృతదేహం రోడ్డుపై పడి ఉండటంతో పోలీసులు మొదట రోడ్డు ప్రమాదంగానే భావించారు. అయితే, మృతుడి మెడ, ముఖంపై ఉన్న గాయాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. పోస్ట్‌మార్టం నివేదికలో బాధితుడు గొంతు నులిమి హత్య చేయబడినట్లు తేలడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అదనపు ఎస్పీ అనురాగ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు వీరేంద్ర తన మేనమామ భార్య (అత్త) పట్ల అక్రమ సంబంధం కోరుకున్నాడు. అతడిని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నాడు.
నిందితులు తొలుత బాధితుడికి మద్యం తాగించి మత్తులోకి దించారు. అనంతరం ఒక మఫ్లర్‌తో గొంతు నులిమి హత్య చేశారు. ఇది హత్య అని ఎవరికీ తెలియకుండా ఉండేందుకు, మృతదేహాన్ని మోటార్‌సైకిల్‌పై ఉంచి, దానిని ఉద్దేశపూర్వకంగా ప్రమాదానికి గురైనట్లు రోడ్డుపై పడేశారు. తద్వారా ఇది రోడ్డు ప్రమాదంగా అందరినీ నమ్మించాలని ప్రయత్నించారు. రాంపూర్ పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వీరిపై మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.