దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అభం, శుభం తెలియని చిన్నారులను కూడా వదలడం లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బస్సులో ప్రయాణీస్తు్న్న బాలికపై కండక్టర్‌తో పాటు అతడి స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే.. ఫిరోజాబాద్ జిల్లాలో 15 ఏళ్ల బాలిక తన తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి బదర్ పుర్ నుంచి ఔరియా వెళ్లేందుకు సోమవారం రాత్రి 11 గంటలకు స్లీపర్ బస్సు ఎక్కింది. దారిలో బస్సును కాసేపు ఆపారు. ఆ సమయంలో బాలిక కుటుంబ సభ్యులతో పాటు ఇతర ప్రయాణీకులు కిందకు దిగారు. ఆ సమయంలో బాలిక ఒక్కతే.. బస్సులో ఉండడాన్ని గమనించిన కండక్టర్ బబ్లూ, అతడి స్నేహితుడు అషు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాలిక తల్లి బస్సులోకి ఎక్కగానే.. బాలిక తనపై జరిగిన దారుణాన్ని తల్లితో చెప్పింది. ఆ తల్లి బస్సును ఆపేందుకు యత్నించగా.. బబ్లూ ఆమెను లాగి పడేశాడు. అలీగఢ్‌లోని టప్పల్ సమీపంలో.. బబ్లూ, అషు బస్సు నుంచి కిందకు దిగి వెళ్లిపోయారు. బస్సు మంగళవారం ఉదయం శిఖోహాబాద్ చేరుకున్న తరువాత బాలిక తల్లి .. శిఖోహాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను పరీక్ష నిమిత్తం ఆస్పత్రి కి తరలించారు. అషును అరెస్ట్ చేశారు. మరో నిందితుడు బబ్లూ పరారీలో ఉండడంతో.. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.