రద్దీగా ఉండే మార్కెట్ లో మొబైల్ ఫోన్‌ను కొట్టేయడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకులను చితక్కొట్టారు. అప్రమత్తమైన స్థానికులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించే ముందు వారిని చితక్కొట్టారు. ఒడిశా రాష్ట్రం, నయాఘర్ జిల్లాలోని ఫతేగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదా-బైగునియా బజార్‌లో మార్కెట్ లో బిజీగా ఉన్న సమయంలో గురువారం మధ్యాహ్నం 1 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఖండపద వైపు నుండి ఇద్దరు బైక్‌పై వచ్చిన యువకులు, సురేష్ స్వైన్ అనే వ్యక్తి షాపింగ్ చేస్తున్నప్పుడు అతని నుండి మొబైల్ ఫోన్ లాక్కొని వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించారు.
మార్కెట్ భారీగా రద్దీగా ఉండటంతో కొంతమంది అప్రమత్తమైన స్థానికులు వారిని పట్టుకోవడంతో అడ్డంగా బుక్కయ్యారు. ప్రజలు ఆ యువకులను ఒక స్తంభానికి కట్టి చితక్కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించారు. ఇచ్ఛాపూర్ గ్రామానికి చెందిన అలోక్ నాయక్, ఖండపద బ్లాక్ పరిధిలోని కైంతపలి గ్రామానికి చెందిన తునా స్వైన్ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఐఐసీ గిరిజా నంద పట్టనాయక్ తెలిపారు. వీరిద్దరూ గత నెలరోజులుగా మార్కెట్‌లో దొంగతనాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు స్థానిక వ్యాపారులు తెలిపారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు పోలీసులు రెగ్యులర్‌గా పెట్రోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.