దారుణం.. కాబోయే భర్తను కట్టేసి.. యువతిపై అత్యాచారం
Two Men molest girl in Guntur District.కాబోయే భర్త కాళ్లు, చేతులు కట్టేసి అతడి ముందే యువతిపై ఇద్దరు దుండగులు
By తోట వంశీ కుమార్ Published on 21 Jun 2021 8:04 AM ISTకాబోయే భర్త కాళ్లు, చేతులు కట్టేసి అతడి ముందే యువతిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరంలోని కృష్ణా నది పుష్కరఘాట్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ గాంధీనగర్‌లోని పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న ఓ యువకుడు, నర్సుగా పనిచేస్తున్న యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. అయితే.. కరోనా కారణంగా వారి పెళ్లి వాయిదా పడింది.
శనివారం రాత్రి ఎనిమిది గంటలకు విధులు ముగించుకున్న ఆయువతి.. కాబోయే భర్తతో కలిసి విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతానగరం పుష్కరఘాట్ వైపు వచ్చింది. 9గంటలకు పుష్కర ఘాట్ వద్ద మాట్లాడుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు వారిపై దాడి చేశారు. యువకుడిని బంధించి యువతిని పక్కకు లాక్కెళ్లారు. దుండగుల్లో ఒకడు బ్లేడును యువకుడి మెడపై ఉంచి బెదిరించాడు. మరొకడు యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత రెండో దుండగుడు అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బాధితులు కేకలు వేసినప్పటికి ఈ ప్రాంతం రోడ్డుకు దూరంగా ఉండడంతో ఎవ్వరికీ వినిపించలేదు. అనంతరం వారివద్ద ఉన్న సెల్‌ఫోన్లను తీసుకుని పడవలో నది మీదుగా పరారయ్యారు.
అనంతరం తేరుకున్న ఆ జంట.. ఓ ద్విచక్రవాహన దారుడి సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. సెల్ టవర్ లొకేషన్స్, సీసీటీవీ ఫుటేజ్‌లు, బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోందని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.