వేరు వేరు చోట్ల రెండు ప్రేమ జంటల బలవన్మరణం
Two love couples committed suicide.ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. అయితే.. వారి
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2022 8:34 AM ISTఇద్దరి మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. అయితే.. వారి ప్రేమ విషయాన్ని ఇంట్లోని పెద్దలకు చెప్పే ధైర్యం చేయలేకపోయారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించరు అనే ఆందోళనతో దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ కలిసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంగారెడ్డి, కుమురం భీం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటలు బలవన్మరణాలకు పాల్పడ్డాయి.
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా కోహిర్ పట్టణానికి చెందిన అమృత(20), వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురానికి చెందిన శివ(22) లు దూరపు బంధువులు. సంగారెడ్డిలో శివ బీఫార్మసీ చదువుతుండగా.. అక్కడే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తోంది అమృత. వీరి మధ్య ఉన్న స్నేహాం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పించే ధైర్యం చేయలేక దారుణ నిర్ణయాన్ని తీసుకున్నారు. బుదేరాలో జనసంచారం లేని ప్రదేశానికి ఆదివారం రాత్రి వెళ్లారు. 8 గంటల సమయంలో శివ.. తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. ఆందోళన చెందిన వారు బుధేరా చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోయింది. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటనలో..
కుమురం భీం జిల్లా వాంకిడిలోని రాంనగర్ కాలనీలో శ్రీకాంత్(22), గీత అలియాస్ శ్యామల(20) నివసిస్తున్నారు. ఒకే కాలనీ కావడంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయాన్ని శ్రీకాంత్ తల్లిదండ్రులు అంగీకరించగా.. గీత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 27న ఇద్దరు కలిసి ఇళ్లు విడిచిపోయారు. కుటుంబ సభ్యులు వారి కోసం వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆకిని గ్రామ శివారులోని ఓ పత్తి చేనులో సోమవారం ఉదయం చెట్టుకు వేలాడుతూ కనిపించారు. మృతదేహాల నుంచి దుర్వాసన వస్తుండడంతో వీరు మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు బావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.