పోలీస్‌ స్టేషన్‌లో అక్కాచెల్లెళ్ల హల్‌చల్‌.. మహిళ ఇన్​స్పెక్టర్​పై చెప్పులతో దాడి

Two Girls beat up female inspector in patna. ఫోన్‌ పోయిందని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఇద్దరు యువతులను పోలీసులు 3 గంటల పాటు వేచి ఉంచారు.

By అంజి  Published on  26 July 2022 5:00 AM GMT
పోలీస్‌ స్టేషన్‌లో అక్కాచెల్లెళ్ల హల్‌చల్‌..  మహిళ ఇన్​స్పెక్టర్​పై చెప్పులతో దాడి

ఫోన్‌ పోయిందని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఇద్దరు యువతులను పోలీసులు 3 గంటల పాటు వేచి ఉంచారు. దీంతో కోపంతో రగిలిపోయిన యువతులు పోలీస్‌ స్టేషన్‌లో వీరంగం సృష్టించారు. యువతులు మహిళా ఇన్‌స్పెక్టర్‌పై దాడికి దిగారు. ఈ ఘటన బీహార్‌ రాజధాని పాట్నాలోని రామకృష్ణ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు జరిగింది. ఆదివారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కేసు సమాచారం అందిన వెంటనే పాట్నా ఎస్‌ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా ఇన్‌స్పెక్టర్‌ను కొట్టిన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీని ఆధారంగా అక్కాచెల్లెళ్లిద్దరినీ జైలుకు పంపారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం నాడు ఇద్దరు అక్కాచెల్లెళ్లు పాట్నాలోని బీర్‌ ప్రాంతం నుంచి రోడ్డుపై నడుస్తుండగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు చైన్‌ స్నాచర్లు.. వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ లాక్కొని పరారయ్యారు. దీంతో చేతిలో ఫోన్‌ లేకపోవడంతో అక్కాచెల్లెళ్లు వారి సోదరుడితో కలిసి రామకృష్ణనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు మొబైల్‌ స్నాచింగ్ గురించి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే అక్కాచెల్లెళ్లిద్దరినీ మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు వేచి ఉంచారు. దీంతో ఆగ్రహంతో అక్కాచెల్లెళ్లిద్దరూ మహిళా ఇన్‌స్పెక్టర్‌ను పోలీస్ స్టేషన్ ఆవరణలో కూర్చోబెట్టి వీడియో తీయడం ప్రారంభించారు. వాగ్వాదం జరగడంతో బాలికలిద్దరూ తమ కాళ్ల నుంచి చెప్పులు తీసి మహిళా ఇన్‌స్పెక్టర్‌ను కొట్టారు.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపారు

రామ్ కృష్ణ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ జహంగీర్ ఆలం మాట్లాడుతూ.. మొత్తం విషయం గురించి సమాచారం ఇచ్చారు. రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ స్నాచింగ్ సంఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి వచ్చిన అమ్మాయిలిద్దరినీ విచారించినట్లు చెప్పారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో సోనాలి కుమారి అనే అమ్మాయి గొడవ చేసిందని, ఆమె మహిళా ఇన్‌స్పెక్టర్ అంకితపై దాడి చేసిందని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. ఆ తర్వాత ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఇద్దరినీ జైలుకు పంపారు.

Next Story