కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. బంగారు భవిష్యత్తుకు బాటను చూపాల్సిన గురువు స్థానంలో ఉన్న ఓ వ్యక్తి.. తన దగ్గరకు శిక్షణ కోసం వచ్చిన ఓ బాలికపై కన్నేశాడు. ప్రత్యేక శిక్షణ పేరుతో బాలికను గర్భవతి చేశాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో చోటు చేసుకుంది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గంట్యాడ మండలానికి చెందిన ఓ విద్యార్థిని ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఆ బాలిక మూడేళ్లుగా ఓ ట్యూషన్ సెంటర్‌కు వెలుతోంది. ఆ ట్యూషన్ మాస్టర్ ఆ బాలికపై కన్నేశాడు. విద్యార్థులంతా వెళ్లిపోయిన తరువాత కూడా ప్రత్యేక శిక్షణ పేరుతో ఆబాలికను అక్కడే ఉంచేశాడు. నీకు తెలివి లేదని, మేధాశక్తిని పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అంటూ బాలికను లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా బాలిక ముభావంగా ఉంటోంది.
సరిగ్గా తిండి కూడా తినకపోవడంతో బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు..బాలిక గర్భవతి అని చెప్పారు. ప్రస్తుతం ఎనిమిదో నెల అని చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు షాక్‌కు గురైయ్యారు. ఏం జరిగిదని బాలికను ఆరా తీయగా.. అసలు విషయం చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు దిశ పోలీస్‌స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నిందితుడికి తన అక్కకుమారైతోనే వివాహం జరిగిందని.. ఉద్యోగం రాకపోవడంతో ట్యూషన్లు చెబుతున్నాడని పోలీసులు తెలిపారు.