విధులకు అనుమతించలేదని.. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
TSRTC driver commits suicide.విధులకు అనుమతించడం లేదని మనస్థాపానికి గురైన ఓ ఆర్టీసీ డ్రైవర్ మంగళవారం
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2021 7:31 AM ISTవిధులకు అనుమతించడం లేదని మనస్థాపానికి గురైన ఓ ఆర్టీసీ డ్రైవర్ మంగళవారం హైదరాబాద్‌లోని రాణిగంజ్-1 డిపోలో ఆత్మహత్మకు పాల్పడ్డారు. పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. తుర్కయాంజాల్‌కు చెందిన తిరుపతి రెడ్డి(52) రాణీగంజ్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు సిక్‌లీవ్‌లో ఉన్నారు. 23,24 తేదీల్లో ఆయన విధులకు హాజరవ్వలేదు. 25వ తేదీన డిపోకు వెళ్లారు. అనుమతి లేకుండా రెండు రోజులు విధులకు గైర్హాజరైనందుకు డిపో సీఐ విజయ్‌కుమార్ ఆయన్ను విధులకు అనుమతించలేదు. డిపో మేనేజర్ (డీఎం)ను కలవమని డ్యూటీ చార్ట్‌లో రాసారు.
మంగళవారం ఉదయం 4 గంటలకు డిపోకు వెళ్ళి మరోసారి డ్యూటీ గురించి అడగ్గా.. డీఎంను కలిసే వరకు డ్యూటి ఇచ్చేది లేదని సీఐ విజయ్‌కుమార్ చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన తిరుపతి రెడ్డి ఉదయం 6.30కు కంట్రోలర్ కార్యాలయానికి వెళ్ళి.. పురుగుల మందు తాగి కింద పడిపోయాడు. స్పందించిన తోటి ఉద్యోగులు ఆయన్ను బస్సులోనే గాంధీకి, అక్కడ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే తిరుపతి రెడ్డి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. విధులకు అనుమతించకపోవడంతో తీవ్రమనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన కుమారుడు అనంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.