మహబూబ్‌నగర్‌లో దారుణం.. పెళ్లైన 8 నెలలకే భార్యను కడతేర్చిన భర్త.. డెడ్‌బాడీని సంచిలో మూట కట్టి..

మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

By -  అంజి
Published on : 5 April 2026 6:40 AM IST

Mahabubnagar Crime News, Love Marriage Tragedy, Wife Murder Case, Domestic Violence Awareness, Mousapet Mandal Incident, Faking Suicide Post Murder, Accused Surrenders to Police, Crime Against Women Telangana

మహబూబ్‌నగర్‌లో దారుణం.. పెళ్లైన 8 నెలలకే భార్యను కడతేర్చిన భర్త.. డెడ్‌బాడీని సంచిలో మూట కట్టి..

మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ పూర్తి చేసిన శ్రీదేవి (21) అనే యువతి, అదే గ్రామానికి చెందిన డ్రైవర్ చందును ప్రేమించింది. ఎనిమిది నెలల క్రితం తన కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ అతడిని వివాహం చేసుకుంది. అయితే, పెళ్లయిన నెల రోజుల నుంచే చందు అసలు రంగు బయటపడింది. రోజూ మద్యం తాగి వచ్చి ఆమెను శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవడంతో, తన బాధను ఎవరికీ చెప్పుకోలేక శ్రీదేవి మౌనంగా భరిస్తూ వచ్చింది.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, చందు విచక్షణ కోల్పోయి శ్రీదేవి గొంతు నులిమి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కట్టి పొలం వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత తన సోదరుడికి ఫోన్ చేసి, శ్రీదేవి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని కట్టుకథ అల్లాడు. గ్రామస్థులు అక్కడికి చేరుకునేలోపే చందు పరారయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించగా, శవపరీక్షలో అది ఆత్మహత్య కాదని, హత్యేనని తేలింది.

శనివారం ఉదయం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చిన సమయంలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని అక్కడికి తీసుకువచ్చేవరకు అంత్యక్రియలు జరపబోమని బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు వారితో మాట్లాడి నచ్చజెప్పడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా, నిందితుడు చందు పోలీసుల ఎదుట లొంగిపోయి తన నేరాన్ని అంగీకరించాడని ఎస్సై వేణు తెలిపారు. ఒక యువతి తన ప్రేమను నమ్మి ప్రాణాలకు తెగించి వస్తే, ఆమెను ఇలా కిరాతకంగా చంపడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Next Story