East Godavari: పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. కులం పేరుతో దుషించడంతో ప్రియురాలు ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ప్రేమ పరిచయం, కులం పేరుతో జరిగిన దూషణలు...
By - అంజి |
East Godavari: పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. కులం పేరుతో దుషించడంతో ప్రియురాలు ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ప్రేమ పరిచయం, కులం పేరుతో జరిగిన దూషణలు చివరికి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. గోకవరం మండలానికి చెందిన 19 ఏళ్ల యువతి, వొకేషనల్ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతూ, అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఏడాది క్రితం సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన వీరి పరిచయం పెళ్లి వరకు వెళ్లింది.
గత ఫిబ్రవరిలో వీరిద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోగా, అప్పట్లో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. అప్పటికి ఆ యువకుడికి 18 ఏళ్లు నిండలేదు. ఈ క్రమంలోనే పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో, యువకుడు మేజర్ అయిన తర్వాత వివాహం జరిపిస్తామని ఇరువర్గాలు అంగీకరించాయి. అయితే, ఇటీవల యువకుడి వయసు 18 దాటడంతో యువతి కుటుంబ సభ్యులు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, యువకుడి కుటుంబం కులం పేరుతో నిరసిస్తూ ముఖం చాటేసింది. ఈ క్రమంలో శుక్రవారం గోకవరం పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి.
పోలీస్ స్టేషన్ చర్చల సమయంలో యువకుడి కుటుంబ సభ్యులు యువతిని అందరిముందే కులం పేరుతో దూషించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు, వివాహానికి అబ్బాయికి 21 ఏళ్లు నిండాలని పోలీసులు కౌన్సెలింగ్‌లో పేర్కొన్నారు. వరుసగా ఎదురవుతున్న అవమానాలు, పెళ్లి నిలిచిపోతుందన్న ఆవేదనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి, శనివారం ఉదయం కోరుకొండలోని తన అమ్మమ్మ ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
తొమ్మిదేళ్ల క్రితం భర్తను కోల్పోయి, కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించుకుంటున్న ఆ తల్లికి ఈ ఘటన కోలుకోలేని దెబ్బ తీసింది. తనకు అండగా ఉంటుందనుకున్న కూతురు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు యువకుడు, అతని కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.