విషాదం: భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి.. భర్త ఆత్మహత్య!
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యంత దయనీయమైన ఘటన చోటుచేసుకుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు...
By - అంజి |
విషాదం: భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి.. భర్త ఆత్మహత్య!
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యంత దయనీయమైన ఘటన చోటుచేసుకుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు, తన వల్ల భార్య ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి, తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన తోటమళ్ల నాగభూషణం (65), జయమ్మ (60) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా అందరికీ వివాహాలయ్యాయి.
గత రెండేళ్లుగా నాగభూషణం తీవ్రమైన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఆ నొప్పిని భరించలేక ఆయన గతంలో పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించగా, ప్రతిసారీ భార్య జయమ్మ ఆయనను కాపాడుతూ వచ్చారు. గురువారం రాత్రి కూడా నాగభూషణం పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా, జయమ్మ గమనించి అడ్డుకున్నారు. తాను బతికున్నంత కాలం తన భార్య తనను చావనివ్వదని, తన అనారోగ్యం ఆమెకు భారం కాకూడదని భావించిన నాగభూషణం ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. అర్థరాత్రి సమయంలో నిద్రపోతున్న భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
అనంతరం తాను కూడా పురుగుల మందు తాగారు. జయమ్మ ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున నాగభూషణం కన్నుమూశారు. జయమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. కుమారుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జగదీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.