పెళ్లైన నాలుగో రోజే విషాదం.. చెరువులో దూకి కొత్త నవ వరుడు ఆత్మహత్య!

ఆ ఇంట్లో ఇంకా పెళ్లి పందిరి తొలగించలేదు.. వచ్చిన బంధువులు కూడా వెళ్లలేదు.. కానీ అంతలోనే ఆ ఇంట పెను విషాదం నిండింది.

By -  అంజి
Published on : 2 March 2026 8:39 AM IST

Baireddypalle Suicide Case, Newlywed Groom Suicide, Chittoor District News, Murali Suicide Baireddypalle, Wedding Tragedy Andhra Pradesh, Police Investigation, CSC Computer Operator Death

పెళ్లైన నాలుగో రోజే విషాదం.. చెరువులో దూకి కొత్త నవ వరుడు ఆత్మహత్య!

ఆ ఇంట్లో ఇంకా పెళ్లి పందిరి తొలగించలేదు.. వచ్చిన బంధువులు కూడా వెళ్లలేదు.. కానీ అంతలోనే ఆ ఇంట పెను విషాదం నిండింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే ఓ నవవరుడు చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లె పంచాయతీ జోగిండ్లు గ్రామానికి చెందిన జె.మురళి (30) స్థానిక సీఎస్‌సీ కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. మురళికి గతంలోనే వివాహమై మనస్పర్థలతో విడాకులు తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25న ఇచ్చాపురానికి చెందిన సుజాతతో అతనికి రెండో వివాహం జరిగింది. ఎంతో ఉత్సాహంగా సాగిన పెళ్లి వేడుకలు ముగిసి నాలుగైదు రోజులు కూడా గడవకముందే ఈ ఘోరం జరిగింది. ఫిబ్రవరి 28వ తేదీన ఎప్పటిలాగే పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన మురళి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో బైరెడ్డిపల్లె పెద్దచెరువు ఒడ్డున చెప్పులు ఉండటాన్ని గమనించిన జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే పోలీసులు చెరువులో గాలించగా మురళి మృతదేహం లభ్యమైంది. వివాహమైన కొద్ది రోజుల్లోనే మురళి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో భార్య సుజాత, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వారి రోదనలతో గ్రామం అంతా కన్నీరుమున్నీరైంది. మురళి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఎస్సై చందనప్రియ ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Next Story