విషాదం.. పెళ్లికి కొన్ని గంటల ముందు ఇద్దరు సోదరీమణుల ఆత్మహత్య
ఒకే ఇంట్లో రెండు పెళ్లిళ్లు.. భాజాభజంత్రీలతో సందడిగా ఉండాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా తీవ్ర విషాదం అలముకుంది.
By - అంజి |
విషాదం.. పెళ్లికి కొన్ని గంటల ముందు ఇద్దరు సోదరీమణుల ఆత్మహత్య
ఒకే ఇంట్లో రెండు పెళ్లిళ్లు.. భాజాభజంత్రీలతో సందడిగా ఉండాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా తీవ్ర విషాదం అలముకుంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో వివాహానికి కొన్ని గంటల ముందు ఇద్దరు సోదరీమణులు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన వెనుక బంధువుల వేధింపులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీప్ సింగ్ కుమార్తెలు శోభ (25), విమల (23) ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి శనివారం పెళ్లి జరగాల్సి ఉంది.
అయితే, శనివారం తెల్లవారుజామున వారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆసుపత్రి నుంచి మృతదేహాలను ఇంటికి తెచ్చిన కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం, వీరిద్దరూ విషపూరిత పదార్థం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
ఈ మరణాలపై మృతుల మేనమామ జస్వంత్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో రద్దయిన సంబంధాలనే మళ్లీ చేసుకోవాలని మృతుల తండ్రి సోదరులు (బాబాయిలు) తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. దీప్ సింగ్ తమ్ముడి వేధింపుల వల్లే తన మేనకోడళ్లు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోదరీమణుల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.