పెళ్లి బరాత్‌లో విషాదం.. డ్రైవింగ్ రాక‌పోయినా కారు న‌డిపిన పెళ్లికొడుకు.. బాలుడి మృతి

Tragedy at the wedding party in Nalgonda District.న‌ల్ల‌గొండ జిల్లాలో జ‌రిగిన ఓ పెళ్లి వేడుక‌లో విషాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2022 11:07 AM IST
పెళ్లి బరాత్‌లో విషాదం.. డ్రైవింగ్ రాక‌పోయినా కారు న‌డిపిన పెళ్లికొడుకు.. బాలుడి మృతి

న‌ల్ల‌గొండ జిల్లాలో జ‌రిగిన ఓ పెళ్లి వేడుక‌లో విషాదం చోటు చేసుకుంది. బ‌రాత్‌లో డ్యాన్స్ చేస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ బాలుడు మృతి చెందాడు.

వివ‌రాల్లోకి వెళితే.. చండూరు మండ‌లం గ‌ట్టుప్ప‌ల్‌కు చెందిన మ‌ల్లేష్ అనే యువ‌కుడికి యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా సంస్థాన్ నారాయ‌ణ‌పురం గ్రామానికి చెందిన యువ‌తితో బుధ‌వారం వివాహం జ‌రిగింది. పెళ్లి అనంత‌రం వ‌ధూవ‌రులు.. వ‌రుడు స్వ‌గ్రామైన‌ గ‌ట్టుప్ప‌ల్‌కు చేరుకున్నారు. గ్రామ స‌రిహద్దు నుంచి వ‌రుడి ఇంటి వ‌ర‌కు స్నేహితులు డీజే పాటలతో బరాత్‌ను ఏర్పాటు చేశారు. వ‌రుడి ఇంటికి కొద్ది దూరం ఉంద‌న‌గా.. వ‌రుడు, వ‌ధువు కారులోంచి దిగి బంధువులు, స్నేహితుల‌తో క‌లిసి డ్యాన్స్ చేశారు.

అనంత‌రం కారులో వ‌చ్చి కూర్చొన్నారు. అప్ప‌టికే కారు డ్రైవ‌ర్ కూడా కింద‌కు దిగి బ‌రాత్ కార్య‌క్ర‌మాన్ని చూస్తూ ఉన్నాడు. త‌న‌కు డ్రైవింగ్ రాన‌ప్ప‌టికి వ‌రుడు మ‌ల్లేష్ కారు న‌డిపేందుకు య‌త్నించాడు. దీంతో కారు ఒక్క‌సారిగా డ్యాన్స్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిపోయింది. డీజే బాక్సులు ఉన్న ట్రాక్ట‌ర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో సాయి చ‌ర‌ణ్‌(13) మృతిచెంద‌గా.. కారు న‌డిపిన మ‌ల్లేష్‌తో పాటు ప‌లువురికి గాయాల‌య్యాయి. బాలుడి తండ్రి ఫిర్యాదు మేర‌కు పెళ్లి కొడుకు మ‌ల్లేష్ పై కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Next Story