దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన శనివారం అర్థరాత్రి ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అయ్యగారిపల్లి వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ముదిగొండ మండలం కమలాపురంలో స్థానికులు దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. నవరాత్రి పూజలు ముగియడంతో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు రెండు ట్రాక్టర్‌లో స్థానికులు బయలు దేరారు. గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలోని సాగర్ కాల్వ వద్దకు ఊరేగింపుగా వెలుతున్నారు. ఓ ట్రాక్టర్‌లో అమ్మవారి విగ్రహం ఉండగా.. మరో ట్రాక్టర్‌లో స్థానికులు ఉన్నారు. నాలుగు కిలోమీటర్లు దూరం ప్రయాణించాక.. విగ్రహం ఉన్న ట్రాక్టర్ కాల్వ వైపు ప్రయాణించగా.. వెనుక ఉన్న ట్రాక్టర్ వల్లభి వైపు వెళ్లింది.
ట్రాక్టర్ వేగానికి తోడు వర్షం కురుస్తుండడంతో అయ్యగారిపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఆ సమయంలో ట్రాక్టర్‌లో 25 మంది వరకు ఉన్నారు. ఈ ఘటనలో అవసాని ఉపేందర్ (26), ములకలపల్లి ఉమ (36), భిక్షాల ఎలగొండ స్వామి(55), చూడబోయిన నాగరాజు (20) అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108లో ఆస్పత్రికి తరలించారు. ఒకేసారి నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.