దారుణం.. చాక్లెట్ ప్యాకెట్ దొంగిలించిందని.. కూతుర్ని కొట్టి చంపిన తండ్రి
ఉత్తరప్రదేశ్‌లోని బుులంద్‌షహర్‌లో ఒక చిన్న చాక్లెట్ ప్యాకెట్ దొంగిలించిందనే అనుమానం పన్నెండేళ్ల బాలిక ప్రాణాల మీదకు తెచ్చింది.
By - అంజి |
దారుణం.. చాక్లెట్ ప్యాకెట్ దొంగిలించిందని.. కూతుర్ని కొట్టి చంపిన తండ్రి
ఉత్తరప్రదేశ్‌లోని బుులంద్‌షహర్‌లో ఒక చిన్న చాక్లెట్ ప్యాకెట్ దొంగిలించిందనే అనుమానం పన్నెండేళ్ల బాలిక ప్రాణాల మీదకు తెచ్చింది. నరోరాలోని రతన్‌పూర్ గ్రామంలో గురువారం ఈ ఘోరం జరిగింది. నిందితుడైన పుష్పేంద్ర అనే వ్యక్తి, తన కుమార్తె పూజ దుకాణం నుండి డబ్బులు చెల్లించకుండా చాక్లెట్ ప్యాకెట్ తీసుకుందని దుకాణదారుడు చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యాడు. మద్యం మత్తులో ఉన్న అతను సాయంత్రం ఇంటికి వచ్చి, చెక్క కర్రతో తన కుమార్తెను విచక్షణారహితంగా బాదాడు. ఆ బాలిక తల్లి ఆర్తి అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమెను పక్కకు నెట్టేసి దాడిని కొనసాగించాడు.
ఈ క్రమంలో పూజ తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోయింది. సహాయం అందించాల్సింది పోయి, ఆమెను అదే స్థితిలో ఇంట్లో ఉంచి, భార్యను గదిలో బంధించి నిందితుడు పరారయ్యాడు. స్థానికులు గమనించి బాలికను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె శరీరంపై 10 నుండి 12 వరకు గాయాలు ఉన్నాయని, తల వెనుక భాగం చిట్లిపోయిందని తేలింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇలాంటిదే మరో భయంకరమైన ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీలో వెలుగుచూసింది. దొంగతనం చేశారనే అనుమానంతో దాదూ హైబత్ యమ్‌గర్ అనే తండ్రి తన ఇద్దరు మైనర్ కుమార్తెలను చిత్రహింసలకు గురిచేశాడు. 10 ఏళ్ల సానిక, 11 ఏళ్ల అనుజలను కాళ్లు కట్టేసి రాత్రంతా తలకిందులుగా వేలాడదీశాడు. మంచినీళ్లు కూడా ఇవ్వకుండా రాత్రంతా వారిని ఏడుస్తూనే వదిలేశాడు. మరుసటి రోజు ఉదయం వారి తాత వచ్చి చూసేసరికి సానిక ప్రాణాలు కోల్పోగా, అనుజ పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చిన అనుజ జరిగిన దారుణాన్ని వివరించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.