యువకుడిని సినిమాకు తీసుకెళ్లి కత్తితో దాడి చేయించిన యువతి
తిరుపతి నగరంలో యువకుడిపై కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 3:59 PM ISTతిరుపతి నగరంలో యువకుడిపై కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది. నగరంలోని ఓ సినిమా థియేటర్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంబీయూ వర్సిటీలో చదువుతోన్న విద్యార్థి లోకేశ్ ఓ యువతితో కలిసి శనివారం సినిమాకు వెల్లారు. స్థానిక పీజీఆర్ థియేటర్‌లో సినిమా చూస్తున్నారు. అయితే.. సినిమా చూస్తుండగానే కార్తీక్ అనే యువకుడు లోకేశ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో లోకేశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక దాడి తర్వాత కార్తిక్‌తో పాటు యువతి పారిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. గాయపడ్డ యువకుడిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడని పోలీసులు చెప్పారు.
అయితే.. తోటి విద్యార్థి లోకేశ్‌కు యువతే సినిమా టికెట్ బుక్ చేసిన మరీ మూవీకి తీసుకెళ్లింది. పథకం ప్రకారమే కార్తీక్‌తో కలిసి లోకేశ్‌పై యువతి దాడి చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. బాధితుడు లోకేశ్ ది ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంగా గుర్తించారు. ఇక కత్తితో దాడి చేసిన యువకుడు కార్తీక్, యువతిది ఇద్దరిదీ సూళ్లూరుపేటగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. యువతీ, యువకుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తదుపరి విషయాలు విచారణ పూర్తి అయిన తర్వాత వెల్లడిస్తామన్నారు పోలీసులు.