నెల్లూరు టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య..
Tiktok star Rafi shaik committed suicide.నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. టిక్‌టాక్ వీడియోలతో క్రేజ్
By తోట వంశీ కుమార్ Published on 23 Jan 2021 3:58 PM ISTనెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. టిక్‌టాక్ వీడియోలతో క్రేజ్ సంపాదించుకున్న ఓ యువకుడిని కొందరు కొట్టి.. వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో మనస్థాపం చెందిన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. నెల్లూరుకు చెందిన రఫీ అనే యువకుడు టిక్‌టాక్ వీడియోలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే.. రెండు రోజుల క్రితం రఫీని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో తమపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. బట్టలు ఊడదీసి కొట్టి, వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో పెడతామని సదరు వ్యక్తుల నుంచి రఫీకి బెదిరింపులు వచ్చాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో.. మనోవ్యధతోనే రఫీ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
అయితే.. రఫీ ఆత్మహత్యపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. గతంలో అతడిపై పలు ఆరోపణలు ఉన్నాయి. రఫీ మరో టిక్‌టాక్ స్టార్ సోనికా కేతావత్ మృతి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2019లో అతడు సోనికాతో కలిసి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన సోనిక ఆస్పత్రిలో చనిపోయింది. సోనికా, రఫీ ఇద్దరూ ప్రేమికులని, ఆమె మరణం వెనక మిస్టరీ ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో రఫీ మానసిక ఆందోళనకు గురై కొన్నాళ్లు టిక్‌టాక్‌కు దూరంగా ఉన్నాడు. తర్వాత అతనికి ఆరోగ్యం బాగాలేదంటూ స్నేహితులు ప్రచారం చేశారు. చికిత్స కోసం రఫీ అభిమానుల నుంచి డబ్బులు కూడా వసూలు చేశారు. ఈ నేపథ్యంలో రఫీ ఆత్మహత్యకు పాల్పడ్డం కలకలం రేపుతోంది.