దేశ వాణిజ్య రాజధాని ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. కందివలి శివారులో గురువారం మధ్యాహ్నం సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు కార్మికులు ఏక్తా నగర్ ప్రాంతంలోని పబ్లిక్ టాయిలెట్ సెప్టిక్ ట్యాంక్‌లోకి ప్రవేశించినప్పుడు ఈ సంఘటన జరిగిందని ఒక అధికారి తెలిపారు. వారితో పాటు ఉన్న మరో కార్మికుడు ట్యాంక్‌లోకి దిగకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన ముగ్గురూ లోపల తప్పిపోయారని తెలుసుకున్న అతను అక్కడి నుండి పారిపోయాడని పోలీసు అధికారి తెలిపారు.
ఇది గమనించిన స్థానిక నివాసితులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఆ వెంటనే అక్కడి చేరుకున్న అగ్నిమాపక దళం, పోలీసు సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న కార్మికులను రక్షించారు. అయితే ముగ్గురు కార్మికులు ఆసుపత్రిలో చేరకముందే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బాధితులను ఎవరు నియమించారో పోలీసులు ఇంకా నిర్ధారించలేదని. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనపై కండివాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.