అతి వేగం ప్రమాదకరం అని ఎంత మంది ఎన్ని రకాలుగా చెబుతున్నప్పటికీ యువత మాత్రం బైక్‌పై వేగంగా దూసుకువెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెలుతున్న బైక్ అదుపు తప్పి ట్రాక్టర్‌ను వెనుకవైపు నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. వాడపల్లి గ్రామానికి చెందిన అన్నా చెల్లెళ్లు ధనావత్ అంజి(20), అంజలి(17), వారి మేనల్లుడు రమావత్ నవదీప్(8) బైక్‌పై ఇంటికి వెలుతున్నారు. మరో 10 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటామనగా.. బొత్తలపాలెం వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి ట్రాక్టర్ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలంలో ఇంటర్ పుస్తకాలు, కాలేజీ బ్యాగ్ చిందరవందరగా పడిపోగా.. ప్రమాదం ధాటికి బైక్ నుజ్జునుజ్జుయింది.
అంజి గూడురు వద్ద రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తుండగా.. అంజలి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.