వికారాబాద్‌లో దొంగల హల్‌చల్.. రెండు వైన్స్ షాపుల్లో చోరీ
వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ లో దొంగలు రెండు వైన్ షాపుల్లో దొంగతనానికి పాల్పడి భారీ ఎత్తున నగదు చోరీ చేశారు.
By Srikanth Gundamalla Published on 29 Sept 2023 12:04 PM ISTవికారాబాద్‌లో దొంగల హల్‌చల్.. రెండు వైన్స్ షాపుల్లో చోరీ
నగరాల్లో రోజురోజుకీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇండ్లను, షాపులను టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒకవైపు గణేశుని నిమజ్జనం శోభాయాత్ర జరుగుతూ ఉంటే... మరోవైపు దొంగలు తమ చేతివాటాన్ని చూపించారు. వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ లో దొంగలు రెండు వైన్ షాపుల్లో దొంగతనానికి పాల్పడి భారీ ఎత్తున నగదు చోరీ చేశారు.
రేకుల షెడ్డుతో ఉన్న శ్రీ మణికంఠ వైన్స్, వినాయక వైన్స్ షాపుల్లో గుర్తు తెలియని కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో షాపు పై నుండి రేకులను నెమ్మదిగా తొలగించి లోపలికి వెళ్లి నగదు చోరీ చేశారు. రెండు వైన్ షాపులో కలిపి రూ. 95 వేలకు పైగా నగదుని చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ఉదయం ఆ రెండు షాపుల యజమానులు వచ్చి తాళాలు తీసి చూడగా పైన రేకులు ఓపెన్ చేసి ఉండడంతో దొంగలు పడ్డట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పరిసర ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా... సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫుటేజీ ఆధారంగా చేసుకుని దొంగలను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు.
ఈ ఘటనపై స్పందించిన ఎస్‌ఐ వేణుగోపాల్ గౌడ్.. బషీరాబాద్ మండల కేంద్రంలో శ్రీ మణికంఠ వైన్స్, వినాయక వైన్స్ లో గుర్తుతెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో చోరీకి పాల్పడినట్టు తెలిపారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉందని.. వైన్స్ యజమానులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. యజమానులు తెలిపిన వివరాల ప్రకారం రూ.95,000 వేల నగదు అపహరించినట్టు కేసు నమోదు చేశామని..దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ వేణుగోపాల్ గౌడ్ వెల్లడించారు.