పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయంలో దొంగలు సినీ ఫక్కీలో చోరీ చేశారు. పెద్ద ఎత్తున్న నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మొత్తం 3.10కోట్ల విలువైన సొత్తును ఎత్తుకెళ్లారు. పకడ్భందీ ప్లాన్ ప్రకారం దొంగలు బ్యాంకు వెనుక వైపు ఉన్న కిటికీలను తొలగించి బ్యాంకులోకి ప్రవేశించారు. అనంతరం లాకర్ అలారం కనెక్షన్‌ను కట్ చేశారు. అనంతరం లాకర్ ఓపెన్ చేసి అందులోని ఉన్న రూ.18.46లక్షలతో పాటు 2.92 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పోలీసులకు దొరకకుండా డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) కూడా తమ వెంట తీసుకెళ్లారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది.
బ్యాంకులో చోరీ జరిగిన విషయాన్ని గురువారం ఉదయం గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి డీసీపీ రవిందర్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌లు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. డాగ్ స్వ్కాడ్ టీంలను కూడా రంగంలోకి దింపారు. కాగా.. దీనిపై రామగుండం సీపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. దొంగలు అన్ని జాగ్రత్తలు తీసుకొని దోపిడికి పాల్పడినట్లు చెప్పారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నామని.. నిందితులను పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు.