కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపూర్‌లోని మేలెకోట్ క్రాస్‌లోని ఏటీఎంలో ఇద్దరు దొంగలు సచిన్, గగన్ దొంగతనానికి ప్రయత్నించారు. దానికి కావాల్సిన అన్ని పరికరాలను సిద్ధం చేసుకొని దాన్ని పగులగొట్టి డబ్బును దోచుకెళ్లాలని అనుకున్నారు. ఏటీఎం చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా స్థానికులు దొంగలను వెంబడించడంతో వారు తమ పనిముట్లన్నీ అక్కడికక్కడే పడేసి పారిపోయారు. పోలీసులు వెంబడించినప్పటికీ దొంగలు పరారయ్యారు. ఘటనా స్థలానికి సాధారణ దుస్తుల్లో ఇద్దరు పోలీసులు వచ్చి పరిశీలించి పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు.
చుట్టుపక్కల దొంగలు కనిపించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తిరిగి పోలీస్ స్టేషన్‌కు వస్తుండగా ఇద్దరు వ్యక్తులు వారి కారును ఆపి లిఫ్ట్ అడిగారు. పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను లోపలికి ఎక్కించుకున్నారు. తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారంటూ ఆరా తీశారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. ఏటీఎంలో దోపిడీకి ప్రయత్నించింది తామేనని ఒప్పేసుకున్నారు. ఏటీఎంను పగలగొట్టేందుకు ప్రయత్నించిన కొన్ని గంటల వ్యవధిలోనే దొంగలు తమకు తెలియకుండా నేరుగా కటకటాల వెనక్కు వెళ్లిపోయారు.