అన్నపై కోపం.. అల్లుడిని చంపిన మేనత్త

The aunt who beat the boy to death because he was rioting in Kadapa. అభం శుభం తెలియని బాలుడి(10)పై అత్త, మామలు పైశాచికంగా ప్రవర్తించారు. ఒంటిపై కాల్చి వాత పెడుతూ చిత్రహింసలకు

By అంజి  Published on  5 Sept 2022 9:47 AM IST
అన్నపై కోపం.. అల్లుడిని చంపిన మేనత్త

అభం శుభం తెలియని బాలుడి(10)పై అత్త, మామలు పైశాచికంగా ప్రవర్తించారు. ఒంటిపై కాల్చి వాత పెడుతూ చిత్రహింసలకు గురి చేశారు. అల్లరి చేస్తున్నాడన్న కారణంతో 10 రోజులుగా.. చిన్న పిల్లాడు అని చూడకుండా ఇష్టమొచ్చినట్లు కొట్టి.. అతడి మృతికి కారణమయ్యారు. తండ్రికి ఇష్టం లేకపోయినా నాయనమ్మ సంరక్షణలో ఉన్న బాలుడిని తీసుకెళ్లిన మేనత్త, ఆమె భర్త బాలుడిని హింసించి చంపేశారు. ఈ హృదయవిదారకమైన ఘటన ఏపీలోని కడపలో జరిగింది. బాలుడి తండ్రిపై ఉన్న కోపంతో బాలుడిని బలి చేసింది.

కడపలో అత్త, మామల చిత్రహింసల కారణంగా బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కోనంపేటకు చెందిన శివ, భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివ, భాగ్యమ్మలు ఉపాధి కోసం గల్ఫ్‌లో ఉంటున్నారు. వారి పిల్లలు నాయనమ్మ సంరక్షణలో ఉంటున్నారు. శివ సోదరి ఇంద్రజ.. అంజన్‌ కుమార్‌ అనే వ్యక్తిని లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంది. ఇది సోదరుడు శివకు నచ్చలేదు. అప్పటినుంచి సోదరి ఇంద్రజతో కొన్నాళ్లు మాట్లాడలేదు.

కొన్ని నెలల తర్వాత ఇంద్రజకు కుమార్తె పుట్టింది. అప్పటి నుంచి ఇంద్రజ పుట్టింటికి రావడం ప్రారంభించింది. ఆమె భర్త అంజన్‌ కుమార్‌ కడపలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌ పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం శివ, భాగ్యమ్మ దంపతులు పిల్లల్ని తన తల్లి ఇందిర దగ్గర ఉంచి ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లారు. ఇటీవల బంధువుల ఇంట్లో జరిగిన బర్త్‌ డే వేడుకల కోసం ఇంద్రజ, అంజన్‌ కుమార్ దంపతులు కోనంపేట వెళ్లారు. ఈ క్రమంలోనే అయాన్‌ను తమతో తీసుకెళ్తామని , కడపలో తమతో ఉంచుకుని అయాన్‌ను చదివిస్తామని చెప్పడంతో కూతురు ఇంద్రజ అనడంతో.. అందుకు తల్లి ఇందిర అంగీకరించింది.

తన కొడుకుని సోదరితో పంపడం తండ్రికి ఇష్టం లేకపోయినా తల్లి సర్ది చెప్పి పంపింది. బాలుడిని తీసుకెళ్లిన ఇంద్రజ, అంజన్‌ కుమార్‌లు అతడిని చిత్ర హింసలకు గురి చేశారు. శివపై ఉన్న ద్వేషంతో అంజన్ కుమార్‌ బాలుడిని తరచూ కొట్టేవాడు. బాలుడి శరీరం మొత్తం గాయాలున్నట్లు గుర్తించారు. తొడపై కాల్చిన గాయాన్ని గుర్తించారు. శనివారం రాత్రి పైశాచికంగా బాలుడిని చితకబాదడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయాన్‌ను కడప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.

బాలుడు మృతి చెందడంతో ఇంద్రజ, అంజన్‌కుమార్‌లు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలియడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బాలుడి నాయనమ్మకు సమాచారం చేరవేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇంద్రజ, అంజన్‌కుమార్‌లపై హత్య కేసు నమోదు చేశారు.

Next Story