ప్రేమ పేరుతో దారుణం.. బాలిక గొంతు కోసి చంపిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ప్రియుడే తన స్నేహితుడితో కలిసి 17 ఏళ్ల దళిత బాలికను...
By - అంజి |
ప్రేమ పేరుతో దారుణం.. బాలిక గొంతు కోసి చంపిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ప్రియుడే తన స్నేహితుడితో కలిసి 17 ఏళ్ల దళిత బాలికను కిరాతకంగా గొంతు కోసి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నౌటన్ హథియాగఢ్ గ్రామానికి చెందిన అంజలి అనే మైనర్ బాలిక, శివమ్ సింగ్ అనే యువకుడు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే శనివారం రాత్రి 8 గంటల సమయంలో అంజలి తన తమ్ముడు, చెల్లితో కలిసి మొబైల్ ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి సహోదర్ పట్టి చౌక్ సమీపానికి వెళ్లింది.
ఆ సమయంలో మోటారు సైకిల్‌పై వచ్చిన శివమ్ సింగ్, అతని స్నేహితుడు అడ్డుకుని ముగ్గురు తోబుట్టువులపై దాడికి దిగారు. నిందితుల చేతిలో ఉన్న కత్తిని చూసి భయపడిన పిల్లలు ప్రాణాలు కాపాడుకోవడానికి పక్కనే ఉన్న గోధుమ చేనులోకి పరుగెత్తారు. నిందితులు వారిని వెంబడించి అంజలిని పట్టుకున్నారు. తోబుట్టువుల కళ్లముందే ఆమె గొంతు కోసి నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే అంజలి ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమిక విచారణలో వీరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారంలో వచ్చిన గొడవలే ఈ హత్యకు కారణమని తేలింది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివమ్ సింగ్ మరియు అతని స్నేహితుడిపై హత్య కేసుతో పాటు SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో అనుమానిత వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సర్కిల్ ఆఫీసర్ సింటి సంజయ్ రెడ్డి తెలిపారు.