బెంగళూరు గ్రామీణ జిల్లాలోని మదనాయకనహళ్లి-హుస్కూర్ రోడ్డులోని APMC సమీపంలో శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గుంతను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ప్రియాంక అనే 26 ఏళ్ల టెక్నీషియన్ బైక్ అదుపుతప్పి లారీ కింద పడి అక్కడికక్కడే మరణించింది. ప్రియాంక బైక్ నడుపుతున్న తన సోదరుడితో కలిసి ప్రయాణిస్తోంది. నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా రోడ్డు దెబ్బతిన్నట్లు సమాచారం. ఒక గుంతను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా, ఆమె సోదరుడు అదుపు తప్పి, ఇద్దరూ బైక్ పై నుంచి పడిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె సోదరుడు హెల్మెట్ ధరించి ఉండటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు, ప్రియాంక హెల్మెట్ ధరించకపోవడంతో లారీ కిందపడి అక్కడికక్కడే మరణించింది. మాదనాయకనహళ్లి పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం నేలమంగళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, "ప్రియాంక సోదరుడు బైక్ నడుపుతుండగా, ఆమె పిలియన్ రైడర్. అతను హెల్మెట్ ధరించాడు. వారు ఇంటి నుండి బయలుదేరి గమ్యస్థానానికి వెళ్తుండగా, అతను గుంతలు ఉన్న రహదారిని నివారించడానికి ప్రయత్నించాడు. వారిద్దరూ బైక్ నుండి పడిపోయారు - హెల్మెట్ ధరించి ఉండటంతో రైడర్ తప్పించుకున్నాడు, కానీ హెల్మెట్ ధరించని ప్రియాంకను లారీ ఢీకొట్టి అక్కడికక్కడే మరణించింది. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి మేము ఇంకా ఆమె సోదరుడి నుండి స్టేట్‌మెంట్ నమోదు చేయలేదు. వారు ప్రస్తుతం మాతో మాట్లాడే స్థితిలో లేరు. మేము మరింత దర్యాప్తు చేసి అతని స్టేట్‌మెంట్ నమోదు చేస్తాము, ఆ తర్వాత ప్రమాదానికి కారణం స్పష్టంగా తెలుస్తుంది” అని తెలిపారు.