తోటి విద్యార్థి వాచీ దొంగతనం చేశాడని ఆరోపిస్తూ ముగ్గురు టీచర్లు కలిసి 9వ విద్యార్థిని కొట్టారు. టీచర్ల దెబ్బలు తాళలేక విద్యార్థి మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జహంగీర్ అనే వ్యక్తి తన 15 కుమారుడు దిల్షాన్‌ను ఈ నెల 23న స్థానిక పాఠశాలలో 9వ తరగతిలో చేర్పించాడు. మధ్యాహ్నం భోజన సమయంలో దిల్సాన్‌ను తరగతి గదికి పిలిచిన ముగ్గురు ఉపాధ్యాయులు.. తోటి విద్యార్థి వాచీ దొంగతనం చేశావంటూ దారుణంగా కొట్టారు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న బంధువులు.. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడి పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు ఆదివారం సాయంత్రం కాన్పూర్‌కు రెఫర్ చేశారు. కాన్పూర్‌లో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. మృతదేహాన్ని రాత్రి గ్రామానికి తీసుకురావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాలుడి తండ్రి జహంగీర్ మాట్లాడుతూ.. తన కొడుకు వాచీ దొంగలించాడని కారణంతో ప్రభాకర్, శివకుమార్, వివేక్‌లు కొట్టారని, కానీ ఆ వాచీని మరొకరు అతడి బ్యాగులో పెట్టారని ఆరోపించాడు.
బీజేపీ నేత మునీష్ మిశ్రా విద్యార్థి ఇంటికి చేరుకుని ఘటనను ఖండించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంగళవారం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాన్పూర్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్పీ కున్వర్ అనుపమ్ సింగ్ తెలిపారు. బాలుడిని టీచర్లు కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతికి కారణం పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే అసలు తెలుస్తుందని పోలీసులు చెప్పారు.