బాలిక ఆత్మహత్య కేసు.. పోలీసుల అదుపులో టీడీపీ నేత
TDP Leader Arrested in 9th class girl suicide case.లైంగిక వేదింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన
By తోట వంశీ కుమార్ Published on 30 Jan 2022 10:04 AM GMTలైంగిక వేదింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో నిన్న(శనివారం) 9 వ తరగతి చదువుతున్న బాలిక ఓ అపార్టుమెంట్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. టీడీపీ నేత వినోద్ జైన్ అనే వ్యక్తి లైంగిక వేదింపులకు పాల్పడినట్లు బాలిక సూసైడ్ నోట్‌లో రాసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఉండే అపార్ట్‌మెంట్‌లోనే నివాసం ఉంటున్న టీడీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతడి ఇంటిని కూడా సీజ్ చేశారు.
నిందితుడిపై ఫోక్సో చట్టం, ఐపీసీ 306 సెక్షన్‌ల కింద కేసులను నమోదు చేసినట్లు ఏసీపీ హనుమంతరావు చెప్పారు. గత 2 నెలలుగా బాలికను వినోద్ జైన్ లైంగికంగా వేధించాడన్నారు. నిందితుడు వినోద్‌జైన్ ఎలా ఇబ్బందులకు గురిచేసేవాడో బాలిక సూసైడ్ నోట్‌లో వివరంగా రాసిందని తెలిపారు. బాలిక లిఫ్ట్‌లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు వేధించేవాడని.. ఈ క్రమంలో బాలిక ఎవరికీ చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవించిందన్నారు. రెండు పేజీల్లో బాలిక తన బాధను తెలియజేసిందని చెప్పారు.
కాగా.. చిన్నారి మృతదేహాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. మార్చురీ దగ్గర బాలిక తల్లిదండ్రులను మంత్రి పరామర్శించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా వినోద్ జైన్ పోటీ చేసి ఓడిపోయినట్లు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. వినోద్ జైన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.