నగల షాపులో 25 కిలోల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లిన దొంగ

తమిళనాడు కోయంబత్తూరులో ఓ దొంగ భారీ చోరీకి పాల్పడ్డాడు.

By Srikanth Gundamalla  Published on  29 Nov 2023 12:46 PM IST
tamilnadu, theft,  jewellery shop,

నగల షాపులో 25 కిలోల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లిన దొంగ

కొంచెం ఆదమరిచి ఉన్నామంటే చాలు.. దొంగలు తమ చేతివాటం చూపిస్తారు. జనాలు ఎక్కువగా ఉన్నచోట్లో పర్సులు, సెల్‌ఫోన్లు ఈజీగా కొట్టేస్తుంటారు. మనం కాసేపటికే గమనించినా పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే.. వీళ్లంతా చిన్నచిన్న పిక్‌పాకెటర్స్‌. తమిళనాడులో ఒక దొంగ భారీ చోరీకి పాల్పడ్డాడు. ఒక్కడే నగల షాపులోకి వెళ్లి ఏకంగా 25 కిలోల వజ్రాభరణాలు అపహరించాడు. స్థానికంగా ఈ చోరీ ఘటన కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తమిళనాడు కోయంబత్తూరులో ఓ దొంగ భారీ చోరీకి పాల్పడ్డాడు. గాంధీపురంలో జోస్‌ అలుక్కాస్‌ బంగారం దుకాణంలో సోమవారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. రాత్రి షాపు కట్టేశాక షోరూం వెనవైపు నుంచి డ్రిల్లింగ్ చేసి లోపలికి వచ్చాడు. ఆ తర్వాత వినియోగదారుడిలా మొత్తం కలియతిరిగాడు. నచ్చిన ఆభరణాలను వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మార్గం నుంచే ఎంచక్కా పారిపోయాడు. ఇదంతా షాపులో నగల షాపులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

ఇకుదయం షోరూమ్‌ సిబ్బంది తెరిచి చూడగా.. దొంగతనం జరిగినట్లు గుర్తించారు. విలువైన ఆభరణాలు.. వజ్రాల నగలు పోవడంతో ఆందోళన చెందారు. కాసేపటికే సీసీ కెమెరాలను పరిశీలించడంతో చోరీ చేసిన వ్యక్తి కనపడ్డాడు. మొత్తంగా 25 కిలోల నగలు మాయమైనట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారూ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. వీడియో ఆధారంగా దొంగతనం చేసింది ఒక్కడే అని వెల్లడించారు. గతంలో షోరూంలో పనిచేసే వ్యక్తి లేదంటే.. షోరూం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తే చోరీకి పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు.

Next Story