అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆవుల ఆనందరావు (52) ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసుల విచారణలో సీఐ ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి రానున్నాయి. 1996 బ్యాచ్‌కు చెందిన సీఐ ఆనందరావు.. గతంలో కడప, అన్నమయ్య జిల్లాల్లో ఎస్సై, సీఐగా విధులు నిర్వర్తించారు. పోలీసు అధికారుల దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్న సీఐ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కాగా ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆనందరావు గత తొమ్మిది నెలలుగా తాడిపత్రి సీఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టణంలోని సీపీఐ కాలనీలోని అద్దె ఇంట్లో తన కుటుంబంతో నివాసముంటున్నారు. గత కొన్ని రోజులుగా భార్య అనురాధతో గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాత్రి ఇంట్లో వారందరూ నిద్రపోయాక సీఐ తన ఇంట్లో ఉరివేసుకున్నాడు. గడిచిన 3 నెలల నుంచి పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సీఐ ఆనందరావు స్వస్థలం చిత్తూరు జిల్లా చంద్రగిరి. సీఐకి ఇద్దరు కుమారులు ఉన్నారు.
సీఐ ఆనందరావు ఆత్మహత్య విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రస్తుతం సీఐ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.